రాష్ట్రంలో జరగనున్న ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కసరత్తు పూర్తి చేసిన సర్కార్ Transfers of IAS Officers in Telangana State: ఐఏఎస్ అధికారుల బదిలీలపై గతకొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. మార్పులు, చేర్పులకు సంబంధించి కసరత్తు జరిగినా వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. తాజా పరిణామాతో ఐఏఎస్ అధికారుల బదిలీలు అనివార్యమయ్యాయి. హైకోర్టు తీర్పు, డీఓపీటీ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమార్ రిలీవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి వెళ్లారు.
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారిని, రాష్ట్ర ప్రభుత్వం సీఎస్‌గా నియమించగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఐఏఎస్ పోస్టింగుల్లో మార్పులు, చేర్పులు అనివార్యమైంది. సోమేశ్‌కుమార్, సీఎస్ పదవితో పాటు రెవెన్యూ, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీసీఎల్ఏ, రెరా ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆ శాఖలు, బాధ్యతలు ఖాళీగా ఉన్నాయి.
నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారి ఇప్పటివరకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ శాఖ ప్రస్తుతం ఖాళీ అయింది. ఇప్పటికే పలు శాఖలకు పూర్తి స్థాయి కార్యదర్శులు లేకపోవడంతో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదనపు బాధ్యతల నుంచి తప్పించాలని కొందరు అధికారులు కోరుతున్నారు. మాణిక్‌రాజ్, రజత్‌కుమార్ షైనీ, ప్రీతిమీనా తదితరులు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్తున్నారు.
ఐఏఎస్‌ల పోస్టింగుల్లో మార్పులు: వారు ఇప్పటివరకు నిర్వర్తిస్తున్న బాధ్యతల్లో, మరొకరిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పలువురు అధికారులు ధీర్ఘకాలంగా ఒకే బాధ్యతల్లో ఉన్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎక్కువ రోజులుగా ఉంటున్నారు. హైదరాబాద్, మేడ్చల్ తదితర జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లు కాకుండా ఇన్‌ఛార్జులే ఉన్నారు. వాటన్నింటి దృష్ట్యా ఐఏఎస్‌ల పోస్టింగుల్లో మార్పులు తప్పనిసరయ్యాయి. శైలజా రామయ్యార్, హరిచందన తదితర అధికారులకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో అందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేసుకోవాల్సి ఉండటంతో త్వరలో బదిలీలు జరుగుతాయని సమాచారం. గతంలో జరిగిన కసరత్తుకు కొనసాగింపుగా కొత్తగా ఉత్పన్నమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మార్పులు, చేర్పులు చేయనున్నారు. సీఎస్ రేసులో చివరివరకు ఉన్న రామకృష్ణారావుకు అదనపు బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
కీలకమైన రెవెన్యూ, వాణిజ్యపన్నుల శాఖ బాధ్యతలను రామకృష్ణారావుకు అప్పగిస్తారని అంటున్నారు. అదే తరహాలో కొందరు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారని చెప్తున్నారు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ ఎన్నికల కోణంలో ఐఏఎస్ పోస్టింగుల్లో మార్పులు,చేర్పులు జరుగుతాయని త్వరలోనే అందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి: