Private Junior Colleges In Telangana: రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల తరలింపు ప్రహసనంగా మారింది. రాజకీయ నేతల ఆశీస్సులుంటే చాలు..మండలం నుంచి మరో మండలానికే కాదు...ఒక జిల్లా నుంచి మరో జిల్లాకూ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. ఈ కారణంగా నిజమైన అవసరం ఉన్న వారికి అన్యాయం జరుగుతోందని కళాశాలల యాజమాన్యాలు ఆక్షేపిస్తున్నాయి.
అపరిష్కృతంగా ఉన్నా.. పక్కనబెట్టి..జూనియర్ కళాశాలలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు వీలు కల్పిస్తూ ఇంటర్ బోర్డు యేటా దరఖాస్తులు స్వీకరిస్తుంది. సాధారణంగా ఒకే మండల పరిధిలో ఒకచోటు నుంచి మరో చోటుకు మార్చుకునేందుకు(లోకల్ షిఫ్టింగ్) బోర్డే అనుమతి ఇస్తుంది. ఒక మండలం నుంచి మరో మండలానికి, లేదా మరో జిల్లాకు తరలించాలంటే(నాన్ లోకల్ షిఫ్టింగ్) ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్‌బోర్డు దరఖాస్తులు ఆహ్వానించగా 320కిపైగా కళాశాలల తరలింపునకు యజమానులు ముందుకొచ్చారు. వాటిల్లో ఇంకా 56 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఆ తర్వాత నాన్ లోకల్ తరలింపును ప్రోత్సహించవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి(2022-23) ఇంటర్‌బోర్డు దరఖాస్తులు ఆహ్వానించలేదు. దరఖాస్తులూ స్వీకరించడం లేదు.
ఇదిగో లేఖ.. అదిగో అనుమతి:ప్రజాప్రతినిధుల సిఫార్సు ఉన్న, పలుకుబడి ఉన్న వారి కళాశాలల తరలింపునకు మాత్రం సర్కార్ పచ్చజెండా ఊపుతోందనే ఆరోపణలున్నాయి. సిఫార్సు లేఖలు ఉన్న పక్షంలో ఫలానా కళాశాల నాన్ లోకల్ షిఫ్టింగ్‌కు అనుమతిచ్చే అంశాన్ని పరిశీలించాలని, ముగ్గురు సభ్యుల కమిటీ(టీఎంసీ)తో పరిశీలించి వెంటనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంటర్‌బోర్డు కార్యదర్శికి లేఖ రాస్తున్నారు. ఆ వెనువెంటనే కార్యదర్శి సర్కారుకు నివేదిక పంపడం, అనుమతులు వచ్చేయడం జరిగిపోతోంది. ఉదాహరణకు కొన్ని రోజుల క్రితం చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ లేఖను ప్రస్తావిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నుంచి హైదరాబాద్‌లోని బండ్లగూడకు కళాశాల తరలింపునకు వీలుగా విద్యాశాఖ అదనపు కార్యదర్శి ఇంటర్‌బోర్డుకు లేఖ రాశారు.