ఇది రాష్ట్ర విద్యుత్ పటం.. ఇందులో ఎరుపురంగులో ఉన్నవి 440 కేవీ సబ్‌స్టేషన్లన్లు, వాటి నుంచి వెళుతున్న విద్యుత్ లైన్లు. ఆకుపచ్చ రంగులో ఉన్నవి 220, నీలిరంగులో ఉన్నవి 132 కేవీ సబ్‌స్టేషన్లు. కొత్త వ్యవస్థలో ఒక్కోదానిపై క్లిక్ చేయగానే అది ఎక్కడ ఉంది, దాని వివరాలు, ఆ లైన్ ఎక్కడి నుంచి ఎటు వెళుతుందనే సమాచారమంతా కంప్యూటర్ తెరపై కనిపిస్తుంది.
విద్యుత్ సరఫరా వ్యవస్థంతా కంప్యూటర్ తెరపై కనిపించేలా డిజిటలైజేషన్ చేసేందుకు ట్రాన్స్‌కో సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) సహకారంతో రాష్ట్రంలోని 132, 220, 440 కేవీ సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్లు, స్తంభాలన్నీ ఉపగ్రహంతో చిత్రీకరిస్తున్నారు. ప్రతిదాన్నీ ‘భౌగోళిక సమాచార వ్యవస్థ’(జీఐఎస్)లోకి తెస్తున్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ సులభతర నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రోజువారీ గరిష్ఠ డిమాండ్ 11,818 మెగావాట్లను తాకింది. ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కరెంటు కొనుగోలు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు మొబైల్ యాప్‌లో చూసుకోవచ్చు..
ఈ నేపథ్యంలో ప్రధాన విద్యుత్ లైన్లలో ఎక్కడ ఏ లోపం తలెత్తినా వెంటనే గుర్తించి సరిచేయడానికి జీఐఎస్ ఎంతగానో ఉపకరిస్తుంది. పైగా అదనపు డిమాండ్ పెరిగిన ప్రాంతాల్లో కొత్తగా టవర్లు, లైన్లు నిర్మించడానికి ప్రస్తుతం సిబ్బంది క్షేత్రస్థాయిలో తిరిగి సర్వే చేయాల్సి వస్తోంది. దీనివల్ల అధిక సమయం పడుతోంది. ఒకసారి డిజిటలైజేషన్ పూర్తిచేసి ప్రతి టవర్‌ను, సబ్‌స్టేషన్‌ను జీఐఎస్ ద్వారా మ్యాపింగ్ చేస్తే వాటి సమాచారాన్ని మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.