తమిళనాడులోని కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా మొత్తం 13మంది మరణించారు. ఈ ఘటనలో తెలుగు జవాన్ లాన్స్‌నాయక్ సాయితేజ కూడా అమరుడయ్యారు. సాయితేజ మరణంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అందరితో కలివిడిగా ఉండేవాడు..
సాయితేజ అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడు. గ్రామంలో పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల సమయాల్లో ఎంతో సరదగా వచ్చి పాల్గొనేవాడు. తమకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టేవాడు. పిల్లలకు ఎన్నో మంచి మాటలు చెప్పేవాడు. అమ్మాయిలు జాగ్రత్తగా, ధైర్యంగా ఉండాలనేవాడు.
-గౌతమి, సాయితేజ పిన్ని
చిన్ననాటి నుంచే సైన్యంలో చేరాలనే ఆసక్తి
సాయితేజ చిన్ననాటి నుంచి సైక్లింగ్, రన్నింగ్‌లో ఎంతో ప్రతిభ చూపేవాడు. చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలనే ఆసక్తి అతనికి ఉండేది. క్రీడల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండేవాడు. సాయితేజ స్నేహితుడు కావడం నాకు గర్వంగా ఉంది. అదే సమయంలో తను అమరుడు కావడం కూడా అంతే బాధగా ఉంది.