Traffic Violations Fines in Telangana :దేశంలో మోటారు వాహనాల చట్టం ద్వారా తీసుకొచ్చిన ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను(Road Accidents) ఆరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఈ నియమాలు దాదాపు దేశమంతటా ఒకేలా ఉంటాయి. 2019 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం.. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా వాహనాలను నడిపే వారిపై చర్యలు చేపడుతున్నారు.
Telangana Traffic Challans Details : రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాలతోపాటు.. హైదరాబాద్ నగరంలో(Traffic Rules in Hyderabad) ట్రాఫిక్ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండడంతో.. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదే స్థాయిలో యాక్టివ్ అవుతున్నారు. ఇటీవల "ఆపరేషన్ రోప్" పేరుతో.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిపై కఠిన చర్యలే తీసుకుంటున్నారు. మరోవైపు.. అధునాతన సాంకేతికతతో రూపొందించిన సీసీ కెమెరాలను(CC Cameras) రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఏర్పాటు చేస్తూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి భరతం పడుతున్నారు. ఇంతకీ తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? పోలీసులు ఎలాంటి వాతలు పెడుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఇకపై భారీ జరిమానా..!
లైసెన్స్ లేని డ్రైవింగ్ (Driving without a Driving License) : మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. 2019 సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. లైసెన్స్ లేకుండా బండి నడిపితే.. రూ.500 జరిమానా విధిస్తారు. అలాగే 3 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
- అర్హత లేని వ్యక్తి వాహనం నడిపితే : వాహనాన్ని అర్హత లేని వ్యక్తి నడిపితే.. ఆ వాహన యజమానికి శిక్ష విధిస్తారు. ఇందుకు.. రూ.500 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే ఛాన్స్ ఉంది.
- L చిహ్నాన్ని ప్రదర్శించాలి : చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా రోడ్డుపై వాహనం నడపకూడదు. అలాగే మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్లయితే.. తప్పనిసరిగా లెర్నర్ లైసెన్స్ పొందాలి. అలాగే వాహనంపై తప్పనిసరిగా ఎరుపురంగులో L సింబల్ ఉండాలి. లేనట్లయితే రూ. 500 జరిమానా విధిస్తారు.
- ఆర్సీ లేకపోతే..(Driving without RC): చట్టం ప్రకారం చెల్లు బాటు అయ్యే.. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ) ఉండాలి. అది లేకుండా వాహనం నడిపితే మొదటిసారి రూ.3000, ఆ తర్వాత కూడా నడిపితే రూ.5,000 జరిమానా విధిస్తారు.
- ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకపోతే (Without fitness certificate) : మోటారు వాహన చట్టం సెక్షన్ 56 ప్రకారం.. చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా రవాణా వాహనాన్ని నడిపితే నడుపుతున్న డ్రైవర్లు లేదా యజమానులకు మొదటి సారి 5 వేలు, రెండవ రూ.10,000 జరిమానా విధిస్తారు. ఒక్కోసారి పెనాల్టీతో పాటు జైలుకు కూడా పంపే అవకాశం ఉంది.
- అధిక లోడ్‌తో వాహనాలను నడిపితే : చట్టంలోని సెక్షన్ 194A ప్రకారం.. పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణీకులతో వాహనాన్ని నడిపితే.. ప్రతీ అదనపు ప్రయాణికుడికి రూ.200 జరిమానా విధిస్తారు.