రెండు భాగాలుగా నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)లోని ఉత్తర భాగానికి ఇప్పటికే అనుమతి లభించగా.. దక్షిణ భాగం ఆమోదానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మరోసారి ఆ దారిలో ట్రాఫిక్‌పై అధ్యయనం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు అవతల సంగారెడ్డి - నర్సాపూర్ - తూప్రాన్ - గజ్వేల్ - భువనగిరి - యాదాద్రి - చౌటుప్పల్ వరకు ఉత్తర భాగాన్ని నిర్మించనున్నారు. సుమారు 80-100 గ్రామాల మీదుగా ఇది వెళ్లనుంది. ఈ మేరకు 158 కిలోమీటర్ల మార్గాన్ని ఖరారు చేసి భూ సేకరణ చేపట్టాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ లేఖ రాసిన విషయం తెలిసిందే.
Regional Ring Road: ఉత్తర భాగానికి క్లియర్.. దక్షిణ భాగంపై మళ్లీ ట్రాఫిక్ అధ్యయనం!
సుమారు 340 కిలోమీటర్ల మేర నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు పనులను అధికారులు రెండు భాగాలుగా చేపట్టనున్నారు. ఉత్తర భాగానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ జాతీయ రహదారుల నంబరును కేటాయించి, భూసేకరణకు అనుమతిచ్చింది. కానీ దక్షిణ భాగం ఆమోదానికి మరింత సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అయితే, దక్షిణ భాగంలోని సుమారు 181 కిలోమీటర్ల చౌటుప్పల్ - షాద్‌నగర్ - కంది - సంగారెడ్డి మార్గానికి సంబంధించి మరోదఫా ట్రాఫిక్ అధ్యయనం చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఉత్తర భాగానికి ఇప్పటికే రెండు దఫాలు ట్రాఫిక్ అధ్యయనం నిర్వహించారు. ఈ భాగంలో గంటకు 18,918 వాహనాలు వెళ్తాయని అంచనా వేశారు. దక్షిణ భాగానికి గతంలో చేసిన ట్రాఫిక్ అధ్యయనంలో గంటకు అయిదారు వేలకు మించి వాహనాల రాకపోకలు ఉండవని నిపుణులు అంచనా వేశారు. ఇంత తక్కువ ట్రాఫిక్ కోసం భారీ మొత్తంలో వ్యయం చేయాలా? అన్న ప్రశ్న మంత్రిత్వ శాఖలో వ్యక్తం అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ భాగానికి మరోదఫా ట్రాఫిక్ అధ్యయనం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో అనుమతి రావడానికి మరింత సమయం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టులో భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించనున్నాయి. రహదారి నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. భారతమాల పథకంలో ప్రాంతీయ రింగు రోడ్డును కేంద్రం చేర్చింది.
ఇదీ చూడండి:Regional Ring Road Hyderabad : ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం నిర్మాణ వ్యయం రూ.7,512 కోట్లు!