‘‘భాజపా ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో ఆదివారం జరగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో పలుప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం.. ట్రాఫిక్ ఆంక్షల అమలుకు ముందైనా మీరు మీ గమ్యస్థానాలు చేరుకోండి.. లేదంటే బహిరంగ సభ పూర్తయ్యాక ఇళ్లకు రండి’’ అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులను కోరారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నందున ఆయా మార్గాల్లో వెళ్లేందుకు అవకాశం ఉండదని ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాలంటూ సంయుక్త కమిషనర్(ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ తెలిపారు. అత్యవసర సమయాల్లో 040-27852482 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ కొనసాగుతాయి. ఎంజీరోడ్, ఆర్‌పీరోడ్, ఎస్‌డీరోడ్‌తో పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయి.
- హెచ్‌ఐసీసీ మాదాపూర్- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్-రాజ్‌భవన్-పంజాగుట్ట-బేగంపేట విమానాశ్రయం- పరేడ్ మైదానం పరిసర ప్రాంతాల్లోనూ ఆంక్షలుంటాయి.
- టివోలీ క్రాస్‌రోడ్స్ నుంచి ప్లాజా రోడ్ మధ్య రహదారి మూసివేస్తారు. సికింద్రాబాద్ పరిధిలో పలు జంక్షన్లలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశాలున్నాయి.