Traffic Restrictions In Hyderabad: కొత్త సంవత్సరానికి అంబరాన్నంటే సంబురాలతో స్వాగతం పలకడానికి.. జంటనగర వాసులు సిద్ధమవుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా.. నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకోని నగర ప్రజలు.. ఈసారి భారీగానే వేడుకలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకురావడంతో పాటు.. పలు నిబంధనలు విధించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు.. పైవంతెనలు మూసివేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్ రహదారుల మీద వాహనాలను అనుమతి నిలిపివేయనున్నారు. ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్‌భవన్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. మింట్‌కాంపౌండ్ రహదారిని పూర్తిగా మూసివేయనున్నారు.
సికింద్రాబాద్ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి మీదుగా.. లోయర్ ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ ఆలయం మీదుగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. ట్రావెల్స్ బస్సులు, లారీలు, భారీ వాహనాలకు జనవరి 1వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల వరకు.. నగర రహదారులపై తిరిగేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పాటు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు.
డిసెంబరు 31 రాత్రి ప్రత్యేక డ్రైవ్‌లు:ట్రాఫిక్ ఉల్లంఘనలపై డిసెంబరు 31 రాత్రి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నెహ్రూ బాహ్యవలయ రహదారిపై శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే కార్లను రాత్రి పది గంటల నుంచి.. జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు పోలీసులు అనుమతి నిరాకరించారు.