తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ వాసులకు అలర్ట్..ఆ మార్గాల్లో మూడ్రోజుల పాటు నో ఎంట్రీ - indian Racing League Final series

Traffic Restrictions in Hyderabad : హుస్సేన్‌సాగర్ తీరం మరోసారి కార్ రేసింగ్‌కు సిద్ధమవుతోంది. రేపు, ఎల్లుండి ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు నుంచి ఈ నెల 11 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

3 రోజుల పాటు ఆ మార్గాల్లో నో ఎంట్రీ.. అటుగా వెళ్లేవారు చూసుకోండి..
3 రోజుల పాటు ఆ మార్గాల్లో నో ఎంట్రీ.. అటుగా వెళ్లేవారు చూసుకోండి..

By

Published : Dec 9, 2022, 11:38 AM IST

Traffic Restrictions in Hyderabad : హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్ తీరం.. మరోసారి కార్ల మోతలతో దద్దరిల్లనుంది. 2023 ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ కార్ రేస్ సన్నద్ధతలో భాగంగా ఈ నెల 10, 11 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌లో నిర్వహించిన రేసింగ్‌లో రేసర్లకు పలు ప్రమాదాలు కావడంతో ట్రయల్ రన్‌తోనే సరిపెట్టారు. మిగతా రెండు సిరీస్‌లను చెన్నైలో నిర్వహించారు. చివరి సిరీస్ హైదరాబాద్‌లో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ మార్గ్‌లో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. నేటి నుంచి 11వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

ఈ మార్గాల్లో నో ఎంట్రీ..: ఐ-మ్యాక్స్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి.. ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్ మీదుగా రేసింగ్‌ ట్రాక్ తిరిగి ఐ-మ్యాక్స్ దగ్గర ఉన్న గ్యారేజీకి చేరుకుంటుంది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌ను పీజేఆర్ విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు. బుద్ధ భవన్-నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్-ట్యాంక్‌బండ్ వైపు మళ్లించారు. రసూల్‌పురా-మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగు తల్లి, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్-రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించారు.

ABOUT THE AUTHOR

...view details