Traffic Restrictions In Hyderabad: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు, ప్రయాణికులు తమకు సహకరించాలని కోరారు. ప్రతి జిల్లా నుంచి ఎన్టీఆర్ స్టేడియానికి 2,300 బస్సుల్లో దాదాపు లక్ష మంది ప్రజానీకం వస్తారని ట్రాఫిక్ వారు భావిస్తున్నారు. అందువల్ల నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు.
ఈ వేడుకల కారణంగా జరిగే బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలు రావడంతో ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్లే మార్గాల్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ జోన్, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందిరాపార్కు చుట్టూ 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ట్రాఫిక్ మళ్లింపు:కవాడిగూడ, అశోక్‌నగర్, ముషీరాబాద్ కూడళ్ల నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందిరాపార్కు, లిబర్టీ, నారాయణగూడ కూడళ్ల నుంచి వాహనాలను వేరే మార్గంలో మళ్లిస్తున్నామన్నారు. రాణిగంజ్, నెక్లేస్‌రోడ్ కూడళ్ల వైపు వెళ్లే వాహనాలను సైతం దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ విడుదల చేశారు. నగరంలో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ను సందర్భానుసారం మళ్లించనున్నట్లు చెప్పారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ వద్ద పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు రంగనాథ్ వివరించారు. సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. కొంత సమయం ముందుగానే బయలుదేరాలని రంగనాథ్ సూచించారు.