హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు 6.60 లక్షలకు పైగా కేసులు నమోదు చేశారు. శిరస్త్రాణం ధరించకుండా వాహనాలపై వెళ్తున్న వారిని గుర్తించి ఫొటోలు తీసేందుకు ట్రాఫిక్ పోలీసులు గల్లీలు, అనుసంధాన రహదారుల్లోనూ.. నిఘా ఉంచుతున్నారు. రహదారులపై నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి వివరాలు, ప్రమాదాల గణాంకాలు, వివరాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు.
జరిమానా.. కౌన్సిలింగ్..
పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా... ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నా.. శిరస్త్రాణం ధరించకుండా వెళ్లేవారు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారని గుర్తించారు. వీరిని కట్టడి చేయకపోతే ప్రమాదాలు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేశారు. అందుకే జరిమానాలు విధించి వాహన చోదకులను గోషామహల్, బేగంపేట ట్రాఫిక్ శిక్షణ కేంద్రాలకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. శిరస్త్రాణం ఎందుకు ధరించాలో వారికి అవగాహన కల్పిస్తున్నారు.
సుప్రీం మార్గదర్శకాల ప్రకారం..
ఒక్కో ఉల్లంఘన ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నాయన్న విషయాలను వారికి దృశ్య సహితంగా చూపిస్తున్నారు. కౌన్సిలింగ్కు హాజరైనట్లు శిక్షణ కేంద్రం ఎస్సై ధ్రువీకరించాకే వారి వాహనాలను తిరిగి ఇస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతూ మైనర్లు పట్టుబడితే వాహనం స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా మోటారు వాహన చట్టం ప్రకారం నేరం... సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీటన్నింటిపై ట్రాఫిక్ పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.