తెలంగాణ

telangana

ETV Bharat / state

శిరస్త్రాణ ధారణ భారం... జరిమానాలూ బేఖాతరు! - తెలంగాణ వార్తలు

హైదరాబాద్​లో ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. యువతకు ఎంత అవగాహన కల్పించినా శిరస్త్రాణ ధారణ భారంగానే చూస్తున్నారు. ఇక జరిమానాలూ బేఖాతరు చేస్తున్నారు. ఫలితంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసులు పలు చర్యలు చేపట్టారు.

traffic-police-claimed-that-many-people-not-wear-helmet-while-bike-riding-in-hyderabad
శిరస్త్రాణ ధారణ భారం... జరిమానాలూ బేఖాతరు!

By

Published : Jan 20, 2021, 7:53 AM IST

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న వారిలో, మృతుల్లో అధికులు శిరస్త్రాణం లేకుండా ప్రయాణిస్తున్నవారేనన్నది ట్రాఫిక్‌ పోలీసుల పరిశీలనలో తేలింది. హైదరాబాద్‌ రోడ్లపై 40 కి.మీ. వేగం కంటే ఎక్కువ వెళ్లడం లేదు కదా? మరి శిరస్త్రాణం ఎందుకని కొందరు వాదిస్తున్నారని, యువత హెల్మెట్‌ ధారణను భారంగా భావిస్తోందని చెబుతున్నారు. ఇలాంటి వారిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పలు చర్యలు చేపట్టారు.

రెండు సార్లు కౌన్సెలింగ్‌

శిరస్త్రాణం ధరించకుండా వెళ్తున్న వారిని నిలువరించి, జరిమానాలు విధించడంతో పాటు రెండుసార్లు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. రెండోసారి కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు శిక్షణ కేంద్రం ఎస్సై ధ్రువీకరించాకే వాహనాన్ని తిరిగి ఇస్తున్నారు. మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

పాయింట్లూ లెక్కలోకి...

ప్రతి ట్రాఫిక్‌ ఉల్లంఘనకు జరిమానాతో పాటు పాయింట్లు ద్విచక్ర వాహనదారుడి ఖాతాలో పడుతుంటాయి. ఇవన్నీ రవాణాశాఖ సర్వర్‌లో నమోదవుతాయి. 12కు గాను ఇప్పటికే పది పాయింట్లు దాటిన వారి వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయి. ఇలాంటి వారు జరిమానాలు కట్టకపోతే జైలుశిక్షలు పడే ప్రమాదముంది.

  • ద్విచక్ర వాహనాలు- 80 శాతం
  • నగరంలో వాహనాలు- 60 లక్షలు
  • వాహనం నడిపేటప్పుడు ఎంత మంది హెల్మెట్‌ ధరించనివారు- 25 శాతం
  • నగరంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు- 500-600
    హెల్మెట్ ధరించని వారిపై కేసులు

నాసిరకం హెల్మెట్లతో... మెదడుకే మోసం!

శిరస్త్రాణం నాణ్యత లేకపోవడం, ఉన్నా నామమాత్రంగా ధరించడం తదితర కారణాలతో చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గ్రేటర్‌లో 60 లక్షల వరకు వాహనాలు ఉంటే చాలా తక్కువ మందే హెల్మెట్‌ ధరిస్తున్నారు. అందులోనూ భద్రత ఇచ్చేవి ఇంకా చాలా తక్కువ. ప్రమాదాలు జరిగితే 75 శాతం కేసుల్లో తలకే తీవ్ర గాయాలవుతున్నాయి. ఒకసారి తలకు గాయమైతే..తిరిగి కోలుకోవడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. తల నేలకు తాకినప్పుడు హెల్మెట్‌ గాయం కాకుండా కాపాడుతుంది.

నాసిరకం హెల్మెట్లతో మెదడుకు ప్రమాదం

రక్షణ ఇలా...

  • తలకు గాయమైనప్పుడు కొద్ది సెకండ్ల పాటు స్పృహ కోల్పోవడం, తలనొప్పి, అయోమయం, తల తేలికగా ఉన్నట్లు అనిపించడం, దృష్టి మసకబారటం, చెవిలో హోరున శబ్దం, రుచి తెలియకపోవడం, బాగా అలసట, నిద్ర వేళల్లో, ప్రవర్తనలో మార్పులు, జ్ఞాపక శక్తి, దృష్టి కేంద్రీకరణలో మార్పులు కనిపిస్తాయి.
  • గాయాలైనప్పుడు తలనొప్పి తగ్గకుండా వేధించడం, మాటిమాటికి వాంతులు, వికారం, ఫిట్స్‌, మాట ముద్దగా రావటం, ఏదైనా అవయవంలో బలహీనత లేదా తిమ్మిర్లు వస్తాయి.
  • కొన్నిసార్లు గాయం బయటికి కనిపించకపోయినా తల అదిరి.. మెదడులోని రక్తనాళాలు దెబ్బతిని హిమటోమాకు దారితీస్తుంది.
  • శిరస్త్రాణం పెట్టుకున్నా మెడ కింద బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాదాల్లో హెల్మెట్‌ పక్కకు ఎగిరిపోయి తలకు గాయాలు తగులుతున్నాయి.
  • శిరస్త్రాణం ప్రమాదాలు, కాలుష్యం, ఎండ నుంచి కాపాడుతుంది.

ఇదీ చదవండి:ఉచిత తాగునీటి పథకంలో చిరు జలక్‌... అప్పడే వర్తిస్తుంది!

ABOUT THE AUTHOR

...view details