తెలంగాణ

telangana

ETV Bharat / state

Traffic police: యువత, మహిళలకు పోలీసుల డ్రైవింగ్‌ శిక్షణ

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు యువతీ యువకులు, మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. బైకులు నడిపేందుకు అవసరమైన లైసెన్స్‌ను పొందేందుకు ముందుగా గోషామహల్‌, బేగంపేటలోని ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో నడపాలన్న అంశంపై అవగాహన కల్పిస్తున్నారు.

Traffic police
డ్రైవింగ్‌ శిక్షణ

By

Published : Nov 4, 2021, 10:39 AM IST

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న వారు వారం రోజులు ముందుగా వస్తే... వాహనం ఎలా నడపాలన్న అంశాలపై శిక్షణ ఇస్తామని ట్రాఫిక్​ పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగినులు, అధికారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ముందు తెలుసుకుంటే..

ద్విచక్ర వాహనాలు ఎలా నడపాలో ముందు తెలుసుకుంటే 15శాతం ప్రమాదాలను తగ్గించవచ్చని ట్రాఫిక్‌ పోలీసులు విశ్లేషించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకునే చాలామంది ఒకటి, రెండు రోజులు బైక్‌లు, స్కూటీలు నడిపి వెళ్తున్నారని తెలుసుకున్నారు. దీంతో డ్రైవింగ్‌ ట్రాక్‌పై నడిపేటప్పుడు భయం, ఒత్తిడితో కొంతమంది సరిగ్గా వాహనాన్ని నడపలేరు. కంగారు, ఒత్తిడిలో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో శిక్షకులు, పోలీసు కానిస్టేబుళ్లు కొత్తగా బైక్‌ నేర్చుకుంటున్న వారితో స్వయంగా మాట్లాడనున్నారు.

డ్రైవింగ్‌ ట్రాక్‌... సిమ్యులేటర్‌

గోషామహల్‌, బేగంపేట ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రాల్లో కరోనా కారణంగా గతంలో తాత్కాలికంగా శిక్షణను నిలిపేశారు. దసరా పండగ తర్వాత నుంచి మళ్లీ శిక్షణ మొదలు పెట్టారు. స్కూటర్‌ ట్రాక్‌తోపాటు సిమ్యులేటర్‌ బైక్‌పైన డ్రైవింగ్‌ నేర్పిస్తున్నారు.

వేగంగా వెళ్తే ఇంతే..

వేగంగా వెళ్లడం, బైక్‌లపై విన్యాసాలు చేసినప్పుడు పడిపోతే ఎలా ఉంటుందోనని శిక్షకులు యువకులకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. విన్యాసాల ద్వారా ఎన్ని అనర్థాలుంటాయన్న విషయాలను లఘుచిత్రాల ద్వారా యువకులకు చూపిస్తున్నారు. యువకులకు శిరస్త్రాణాల ధారణపై పలు లఘుచిత్రాలను చూపిస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలనుకునే యువకులు, మహిళలు, యువతులు ఎవరు వచ్చినా శిక్షణ ఇప్పిస్తామని గోషామహల్‌ ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రం ఇన్‌స్పెక్టర్‌ హరీష్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details