చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాది ఆనందంగా జరిపే పండుగ దీపావళి. ఇంట్లోకి కొత్త వస్తువులు తెచ్చుకోవటం, వివిధ రకాల పిండివంటలు చేసుకోవటం, బంధుమిత్రులకు మిఠాయిలు పంచటం ఇలా మన సంతోషాన్ని కుటుంబసభ్యులతో పాటు సన్నిహితులతో పంచుకునే సందర్భం. ఇక రాత్రయ్యే సరికి సంప్రదాయం ప్రకారం గుమ్మం వద్ద దీపాలు వెలిగిస్తాం. బాణాసంచా కాల్చి మన ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకుంటాం. అయితే కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న వేళ ఆరోగ్యపరంగానే కాకుండా, ఆర్థికంగానూ అందరం సతమతమవుతున్న పరిస్థితి.
టపాసులు వద్దు
టపాసుల మోతతో కరోనా రోగులతో పాటు... వైరస్ నుంచి బయటపడినవారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే సంప్రదాయాల్ని అనుసరించటం ద్వారా ఎవరికీ ఇబ్బందులు లేని రీతిలో పండుగను నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా లక్ష్మీపూజతో సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఇంటిని అందంగా అలంకరించుకోవటం, రంగవల్లులు దిద్దుకోవటం, దీపాలను వరుస క్రమంలో వెలిగించటం ద్వారా సంప్రదాయాల్ని పాటించినట్లవుతుంది. అలాగే పండుగను బాగా చేసుకున్నట్లవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
ప్రమిదలు వెలిగించండి
ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఆకృతులలో ప్రమిదలు లభిస్తున్నాయి. మన ఇంటికి సరిపోయిన వాటిని ఎంపిక చేసుకుని తెచ్చి సాయంత్రం వేళ వాటిని వెలిగించాలని సూచిస్తున్నారు. దీపకాంతుల మాదిరిగా మన జీవితాలను వెలుగులమయం చేసుకోవచ్చని అంటున్నారు.
నేటి హైటెక్ యుగంలో సంప్రదాయ దీపావళి సాధ్యమేనా అంటే సాధ్యమని నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. ఇంట్లో పూజా మందిరంతో పాటు గుమ్మాలు, ప్రహరీగోడ, చెట్ల వద్ద ఇలా వీలైనన్ని ఎక్కువచోట్ల దీపాలు వెలిగిస్తున్నారు. పండుగ నాడు 108 దీపాలు వెలిగించటం మంచిదని పెద్దలు చెబుతారు. అదే సూత్రాన్ని పాటిస్తున్నారు. అలాగే లక్ష్మీ పూజ, గుమ్మడికాయకు పూజ చేయటం వంటి సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నారు. కేవలం తమ కుటుంబసభ్యులే కాకుండా ఇరుగుపొరుగుని ఆహ్వానించి దీపాలు వెలిగించటం, లక్ష్మీ పూజ చేయటం ద్వారా పదిమంది కలిస్తేనే పండుగ అనే ఒరవడిని నిజం చేస్తున్నారు.
అసలే కరోనా టైం.. టపాసులెందుకు దీపాలు చాలు! దీపాలతో ఆరోగ్యం
ముగ్గులువేయటం, దీపాలు వెలిగించటంలోనూ ఒక్కో ఏడాది ఒక థీమ్‌ను అనుసరిస్తున్నారు. ఇలా చేయటం ద్వారా తమలోని సృజనను బయటకు తీయటంతో పాటు.. వీలైనంత ఎక్కువసేపు భక్తి పారవశ్యంలో ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ఆవునెయ్యితో దీపాలు వెలిగించటం ద్వారా వచ్చే పొగ ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ముఖ్యంగా చలికాలం మొదలైన సందర్భంలో, కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో వెలుగులకు, వేడికి దగ్గరగా ఉండటం మంచిదని చెబుతున్నారు. శబ్ధాలు వచ్చే టపాసులతో కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని... కరోనా సమయంలో అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని అంటున్నారు. అందుకే సంప్రదాయాలను అనుసరిస్తూ పండుగ జరుపుతూ.. పర్యావరణ దీపావళికి జై కొడుతున్నారు.
అయితే దీపావళి వేళ టపాసులు కాల్చటం కూడా సంప్రదాయమే కదా అనే అభిప్రాయం కొందరి నుంచి వస్తోంది. కానీ దీపావళిని బాణాసంచా మోతలతో కాకుండా వెలుగుల సమూహంగా జరపటం ద్వారా కరోనా సమయంలో మనకు, మనతోటి వారికి మంచిదని ఆధ్యాత్మికవేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:గన్‌ఫౌండ్రీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం