ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

Veggies: కూరగాయలు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి! - కాయగూరలు తాజాగా ఉంచేందుకు వ్యాపారుల దుశ్చర్యలు

తాజాగా.. మంచి రంగులో మెరిసిపోతున్న కూరగాయలు (vegetables) , ఆకుకూరలు కొనుగోలు చేస్తున్నారా? అయితే అవి నిజంగా తాజాగా ఉన్నాయా... లేదా రసాయనాలతో నిండిపోయాయా అని ఒక్కసారి ఆలోచించండి!

Traders are consuming dangerous levels of chemicals to keep vegetables fresh in telangana
Veggies: కూరగాయలు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి!
author img

By

Published : Jul 26, 2021, 6:51 AM IST

సాధారణంగా ప్రతి మనిషి రోజుకు 350 గ్రాముల కాయగూరలు, వంద గ్రాముల పండ్లు తినాలని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే పండ్లను కార్బైడ్‌ వంటి వాటితో మాగబెడుతున్నారు. తాజాగా కాయగూరల (fresh vegetables) విషయంలోనూ రసాయనాల(chemicals) వినియోగం పెరుగుతుండటంతో ఏం తినాలన్నా ఒకింత ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. కాయగూరలు పాడైపోకుండా కొందరు వ్యాపారులు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నారు. అప్పటికప్పుడు విక్రయించేందుకు వీల్లేని పరిస్థితుల్లో కాపర్‌ సల్ఫేట్‌లో ముంచి కాయగూరలను తాజాగా ఉంచుతున్నారు.

బఠాణి, పచ్చిమిర్చిలో పచ్చరంగు కోసం మాలచైట్‌ అనే రసాయనం వినియోగిస్తున్నారు. సాధారణంగా ఆకుకూరలు మూడు నుంచి నాలుగు గంటల వరకు వాడిపోకుండా ఉంటాయి. తర్వాత వాటికి అందాల్సిన సూక్ష్మ పోషకాలు నిలిచిపోవడంతో వాడిపోతాయి. మరుసటి రోజు వరకు నిల్వ చేసేందుకు రైతులు గోనె సంచులు, గుడ్డ కప్పి ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటారు. కానీ కొందరు వ్యాపారులు రసాయనాలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి కాయగూరలను ఎంత కడిగినా రసాయనాలను వేరు చేయలేమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ‘‘కాయగూరలను తాజాగా ఉంచేందుకు రసాయనాల వినియోగంపై ప్రత్యేకంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కాయగూరలలో చొచ్చుకు వెళ్లే రసాయనాలు, వాటి శాతం, ఎంత తరచుగా వాటిని తింటున్నామనే విషయాలపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.’’ అని ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త గణపవరపు సుబ్బారావు వివరించారు.

జీర్ణవ్యవస్థపై అధిక ప్రభావం

కాయగూరలను తాజాగా ఉంచేందుకు వాడుతున్న రసాయనాలు ఎక్కువగా డైయింగ్‌ లేదా టెక్స్‌టైల్స్‌ పరిశ్రమల్లో వాడుతుంటారని... అవి ప్రమాదకరమని కోఠి మహిళా కళాశాల ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ విభాగాధిపతి డాక్టర్‌ సంతోషి వివరించారు. ఈ రసాయనాల వాడకంతో అప్పటికప్పుడు కాకపోయినా, నిత్యం తింటుంటే అనారోగ్యానికి గురవుతాం. నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.

  • మొదటగా జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. క్రమంగా రక్తంలోకి.. తర్వాత మెదడుకు చేరతాయి.
  • రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది. తక్కువ వయసులోనే మతిమరుపు, నరాల బలహీనత.. చివరగా క్యాన్సర్‌ వంటి వ్యాధులు వస్తాయి.
  • మనిషి జీర్ణక్రియకు అవసరమైన ప్రొబయోటిక్‌ బ్యాక్టీరియా పనితీరును రసాయనాలు దెబ్బతీస్తాయి.

చట్టం ఏం చెబుతోంది:రసాయనాలు వినియోగించి నిల్వ ఉంచే వ్యాపారులపై కేసుల పెట్టేందుకు వీలుందని అధికారులు చెబుతున్నారు. ఫుడ్‌ సేఫ్టీ ప్రమాణాల చట్టం ప్రకారం ఆరు నెలల వరకు జైలుశిక్షతోపాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించే వీలుంది.

రంగులు...రసాయనాలు

  • కాపర్‌ సల్ఫేట్‌.. నీలం రంగు కోసం వినియోగిస్తారు.
  • మాలచైట్‌.. పచ్చరంగు తీసుకువచ్చే వాడతారు.
  • రోడమైన్‌-బి.. ఎర్రరంగు కోసం వినియోగిస్తుంటారు.
  • నైట్రేట్స్‌.. మాంసం తాజాగా ఉండేందుకు, గులాబీ రంగు కోసం వాడతారు. ఇలా ప్రతి రంగు కోసం ఏదో ఒక రసాయనం వాడుతున్నారు.

ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం

కాయగూరలను తాజాగా ఉంచేందుకు కొన్ని రకాల రసాయనాలు వినియోగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ తరహా పద్ధతులు నగరంలో తక్కువగా ఉండగా, శివారు ప్రాంతాల్లో కొంతమేర ఎక్కువగా జరుగుతూ ఉండవచ్చు. త్వరలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి కాయగూరలను పరిశీలిస్తాం. ఆహార కల్తీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details