Mallu Ravi fires on BJP and TRS: టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. భవిష్యత్‌లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పాదయాత్ర విజయవంతంగా సాగిందన్న మల్లు రవి... దేశ వ్యాప్తంగా భారత్ జోడోయాత్రకు మంచి ఆదరణ లభిస్తుందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన జోడోయాత్రకు సహకరించిన కార్యకర్తలు, పార్టీ అభిమానులకు మల్లు రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలో మద్యం, డబ్బు ఏరులై పారిన ఎన్నికగా మునుగోడు ఉపఎన్నిక నిలుస్తుందని ఆరోపించారు. అధికారం, అంగబలంతో తెరాస, భాజపాలు కుళ్లు రాజకీయాలు చేశాయని వ్యాఖ్యానించారు.
'భవిష్యత్తులో అధికారం కాంగ్రెస్ పార్టీదే. జోడోయాత్రను ప్రజలు విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే రాహుల్ యాత్ర చేపట్టారు. తెలంగాణలో అన్ని వర్గాల సమస్యలు రాహుల్ తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలు చైతన్య వంతులు, పోరాట పటిమ కలవారు. తెరాస, భాజపా కలిసి డబ్బుతో మాయ చేశారు. కాంగ్రెస్ మాత్రమే ప్రజల తరఫున యుద్ధం చేసింది. మునుగోడు ఎన్నిక అవినీతి ఎన్నికగా దేశచరిత్రలో నిలిచిపోతుంది.'-మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు