కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణను నిరాశపరిచిందని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో కొన్ని మార్పులు తప్ప బడ్జెట్‌లో కొత్తగా ఏమి లేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేస్తారని ఉత్తమ్ తెలిపారు. నిరుద్యోగ యువత, రైతులు, మహిళలు, విద్యార్థులు,ఉద్యోగాలను సృష్టించే రంగాల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు లేవని విమర్శించారు.
'సామాన్యుల ఆశలపై మోదీ ప్రభుత్వం నీళ్లు చల్లింది' - TPCC Uttam Kumar reddy Reacts On Central Budget 2020
కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరుత్సాహపరిచిందన్నారు టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం బాధకరమన్నారు. విభజన చట్టంలోని హామీలను ప్రస్తావించకపోవటం నిరాశకు గురి చేసిందని ఆయన పేర్కొన్నారు.
2022 నాటికి కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని ఏవిధంగా రెట్టింపు చేస్తోందో వివరించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ పాలనలు ప్రభుత్వ ఆస్తులను సృష్టించాయని... భాజపా ప్రభుత్వం ఆ ఆస్తులను ప్రైవేట్ పార్టీలకు అమ్ముతోందని ఆరోపించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీ సంస్థ వాటాను ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య రీతిలో ఒక జిల్లా ఆసుపత్రికి ఒక వైద్య కళాశాల జతచేయాలని ప్రతిపాదించిన పథకం వల్ల... ఆ ఆసుపత్రులలో వైద్య సేవలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అందమైన, మోసపూరిత పదాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించడం తప్ప ప్రజలకు బడ్జెట్‌లో ఒరిగిందేమీ లేదన్నారు.