Revanth Letter To KCR: హైదరాబాద్ డ్రగ్స్ వినియోగ కేంద్రంగా మారుతోందని ఐదేళ్లుగా చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ కారిడార్ ఏర్పాటు జరిగిందేమో అన్న కొత్త సందేహాలు వస్తున్నాయన్నారు. నగరంలో నానాటికి పెచ్చుమీరుతున్న డ్రగ్ మాఫియాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎనిమిది పేజీల బహిరంగ లేఖ రాశారు.
ఇంజినీరింగ్ విద్యార్థి మరణం బాధాకరం: హైదరాబాద్‌లో డ్రగ్స్ భూతంతో తొలి మరణం సంభవించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. మత్తు మందుకు బానిసై 23 సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యార్ధి మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటన తెలంగాణ సమాజాన్ని నిర్ఘాంత పోయేలా చేసిందన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాదకద్రవ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. డ్రగ్స్ భూతం ఏదొక రూపంలో పడక విప్పినప్పుడల్లా...అందులో ప్రమేయం ఉన్న రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎన్ని టాస్క్‌ఫోర్స్‌లు వేసినా.. ప్రత్యేక అధికారులతో పర్యవేక్షించినా డ్రగ్స్ మాఫియా అంతం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు.