సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరామర్శించారు. అయితే అనూహ్యంగా పోలీసుల కళ్లుగప్పి వెనుక గేటు నుంచి ఆయన ఆస్పత్రిలోకి ప్రవేశించారు. బాధిత యువకుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే బాధితులను పరామర్శించేందుకు రాజకీయ పార్టీల నేతలు వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించారు. అంతకు ముందు స్టేషన్లో ఆస్థుల ధ్వంసంపై కేసులు నమోదైన 52 మంది విద్యార్థులను కోర్టులో హాజరు పరిచేముందు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు గాంధీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో భద్రతను పెంచారు.
ఆసుపత్రి ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించారు. మీడియాను అనుమతించలేదు. చివరకు ఆసుపత్రిలోకి వెళ్లే రోగులు, బంధువులు, వైద్యులు, సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాత లోపలకు అనుమించారు. కట్టుదిట్టుమైన భద్రత నడుమ అపరిచితులెవరినీ అనుమతించలేదు. లోపలకు వెళ్లే ద్వారా మూసివేసి... బయటకు వెళ్లే ద్వారా గుండానే రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేయడంతో రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
పోలీసుల భద్రత కట్టుదిట్టంగా ఉన్న సమయంలోనే... రేవంత్‌రెడ్డి గాంధీ ఆస్పత్రి వెనుక గేటు నుంచి ఆస్పత్రిలోకి ప్రవేశించారు. చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారితో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్యపరిస్థితి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 12మంది యువకులకు గాయాలయ్యాయి.