Revanthreddy on Rahul Gandhi Disqualification : రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అదానీ కుంభకోణంపై చర్చ జరుగకుండా ఉండేందుకే రాహుల్ పై వేటు వేశారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని మండిపడ్డారు. సాయంత్రం ఏఐసీసీ ముఖ్య నేతల సమావేశం కానుందని పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. తాను కూడా జూమ్ వేదికగా పాల్గొంటానని తెలిపారు.
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపు చర్యే : మధ్యయుగం చక్రవర్తిలా మోదీ వ్యవహరిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌పై పైకోర్టుకు వెళ్లేందుకు అప్పీల్ చేసుకొనేందుకు 30 రోజుల సమయం ఇచ్చారనీ.. అయినా అనర్హత వేటు వేయడం కక్ష సాధింపు చర్యేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో బీజేపీ వైఫల్యాలను రాహుల్ గాంధీ ఎండగట్టారన్నారు. ముఖ్యంగా అదానీ కుంభకోణంపై ప్రశ్నిస్తున్నందుకే ఈ అనర్హత వేటని రేవంత్ దుయ్యబట్టారు.
అక్రమ నిర్బంధాలు దుర్మార్గం.. ప్రభుత్వ ఆటవిక చర్య :మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాయం విద్యార్థి ఐకాస చేపట్టిన నిరుద్యోగ మార్చ్‌కు వెళ్లకుండా తనను, పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేయడంపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 50 లక్షలమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఓయూ విద్యార్థులు నడుంబిగించారన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ పవిత్ర కార్యక్షేత్రం అని పేర్కొన్నారు. 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమం ఇక్కణ్నుంచే ఊపందుకుందన్న రేవంత్.. రాజకీయ పార్టీలు విఫలమైన సమయంలో ఓయూ విద్యార్థులే ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తుచేశారు.