Revanthreddy fires on CM KCR : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబీకులు.. భారీగా దోచుకున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్.. భూములు కట్టబెట్టడం ద్వారా సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్లు అక్రమంగా పోగేసుకున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం తమకు నచ్చిన వారికి భూములు కట్టబెడుతోంది: హైదరాబాద్ ఖానామేట్‌లో 41/14 సర్వే నంబర్లో రూ. 800 కోట్లు విలువైన 8 ఎకరాల భూమిని వందకోట్లకే కేసీఆర్ కుటుంబం, యశోదా ఆసుపత్రి యాజమాన్యం దోపిడీ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. యశోద ఆస్పత్రికి ప్రభుత్వం అప్పనంగా భూములు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు నచ్చిన వారికి భూములు కట్టబెడుతోందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక భూములపై కేసీఆర్ కుటుంబం కన్ను పడిందన్నారు. 2012లోనే ఖానామెట్‌లో ఎకరా రూ.12 కోట్లు ధరగా నిర్ణయించారన్న రేవంత్.. తక్కువ ధరకు భూములు పొందిన కంపెనీలకు హెచ్‌ఎండీఏ నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. అలెగ్జాండ్రియా ఫార్మా, మారుతీ సుజుకీ కంపెనీలకు హెచ్‌ఎండీఏ నోటీసులు ఇచ్చిందన్నారు. మారుతీ సుజుకీ కంపెనీ ఎకరా రూ. 12 కోట్లు చొప్పున చెల్లించిందన్న రేవంత్‌రెడ్డి... అలెగ్జాండ్రియా ఫార్మా మాత్రం భూమి ధర విషయంలో కోర్టుకెళ్లిందని తెలిపారు.
'అలెగ్జాండ్రియా ఫార్మాకు కేటాయించిన భూములపై కేసీఆర్ కుటుంబం కళ్లుపడ్డాయి. యశోద ఆస్పత్రికి ఇచ్చేందు కోసం అలెగ్జాండ్రియా ఫార్మాపై ఒత్తిడి తెచ్చారు. రవీంద్రరావు, కల్వకుంట్ల జగన్నాథరావు అలెగ్జాండ్రియా ఫార్మా భూములు కొట్టేయాలనుకున్నారు. రవీంద్రరావు, కల్వకుంట్ల జగన్నాథరావు అలెగ్జాండ్రియా ఫార్మా కంపెనీలో బలవంతంగా చేరారు. రవీంద్రరావు, జగన్నాథరావు, దేవేంద్రరావు హైకోర్టులో కేసు గెలుచుకుని భూమి దక్కించుకున్నారు. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లట్లేదు?.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు