Revanth reddy On KTR: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సవాల్‌ను కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2004 నుంచి 2014 వరకు రైతు సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అదే విధంగా 2014 నుంచి ఇప్పటి వరకు రైతుల కోసం తెరాస ప్రభుత్వం ఏం చేసిందో కూడా చర్చించేందుకూ తాము సిద్ధమని రేవంత్ చెప్పారు. వేదిక, తేదీ, సమయం ఎక్కడో కేటీఆర్ ప్రకటిస్తే తాము వస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి తనతోపాటు కిసాన్ కాంగ్రెస్ ప్రతినిధులు కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డిలతో పాటు సీనియర్ నాయకులు పాల్గొంటారని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం తరఫున కేటీఆర్‌తోపాటు అవసరమైన యంత్రాంగాన్ని, నాయకులను వెంట తెచ్చుకోవచ్చన్నారు. గతంలో పలుసార్లు సవాల్ విసిరి.. కేటీఆర్ వెనక్కు పోయిన సందర్భాలు ఉన్నాయని ఇప్పుడూ అదే జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల్లో 75 వేల మంది రైతులు చనిపోయినట్లు... రైతు బీమా వివరాలను ప్రభుత్వమే వెల్లడించిందన్నారు.. రేవంత్‌రెడ్డి. ఇంత మంది రైతులను బలికొన్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.