ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (tpcc president revanth reddy) దుయ్యబట్టారు. జేఏసీ అంటే... జాయింట్ యాక్టింగ్ కమిటీగా ఆయన అభివర్ణించారు. ఏడేళ్లల్లో ముఖ్యమంత్రి కేసీఆర్... 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టారని,... రైతులు... వాటిలో కమీషన్ అడగట్లేదని... పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని మాత్రమే కోరుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు (Congress Dharna on Paddy Procurement). నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు సాగిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బషీర్‌బాగ్‌లో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కార్యక్రమంలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీలో ఉద్రిక్తత
ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసేందుకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కమిషనర్ కార్యాలయం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని కాంగ్రెస్ శ్రేణులు ముందుకు వచ్చే ప్రయత్నం చేయటంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే ధర్నా చేపట్టారు. ఇందిరా పార్క్ వద్ద తెరాస చేపట్టిన ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్... రైతుల పక్షాన మాట్లాడతారని ఎదురు చూశామని, మోసపూరిత వైఖరినే కొనసాగించారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.
'వ్యవసాయ కమిషనర్‌కు రైతుల సమస్యలపై వినతి పత్రం ఇద్దామని వచ్చాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయి. జేఏసీ అంటే..జాయింట్ ఆక్టింగ్ కమిటీ...3లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టినవ్ కదా.. వాటిలో కమిషన్ అడగట్లేదు.... పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని కోరుతున్నాం. ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్.. రైతుల పక్షాన మాట్లాడతాడని ఎదురు చూసినం. ఇందిరా పార్క్ వద్ద ఏర్పాట్లు చూస్తే.. పరేషాన్ అవుతారు. ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా.. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కల్లాల వద్దకు వెళ్లాలి. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలి. బండి సంజయ్, కిషన్ రెడ్డి మీరు దిల్లీకి వెళ్లి మోడీని నిలదీయాలి. ఒకరినొకరు కొట్టుకున్నట్లు చేసి ప్రజలను చంపే ప్రయత్నం చేస్తున్నారు.' -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు