తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు కోదండరాంపై పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ రథసారథిని ఇలా అవమానపరచడమేంటని ప్రశ్నించారు. కోదండరాం పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్, సాగరహారం నిర్వహించిన వ్యక్తిపై ఇలాంటి దుర్మార్గపు చర్యలకు సమైక్య పాలకులు కూడా దిగలేదని పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాస్కీ గౌడ్ ద్వజమెత్తారు. భారత్ బంద్ సందర్భంగా హైదరాబాద్‌లో ఆచార్య కోదండరాంను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పోలీసులు ఆయనపై బల ప్రయోగం చేసి ఒంటి మీద బట్టలు చించేసి దారుణంగా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు.