గత హామీలను నెరవేర్చని సీఎం కేసీఆర్... పంజాబ్‌లో చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు ఇస్తామంటే ఎలా నమ్మాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్ ద్వారా(Revanth tweet) ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల గుర్తింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు మృతి చెందారని తెలిపారు. అనధికారిక లెక్కల ప్రకారం 40 వేల మంది చనిపోయారన్నారు. ఇంతవరకు వారి కుటుంబాలను ఆదుకోలేదని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇస్తామన్న వరద పరిహారం ఇవ్వలేదని... ఇలా ప్రజలకిచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్‌లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకుంటామంటే ఎలా నమ్మేదని రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో(Revanth Reddy on kcr) పేర్కొన్నారు.
రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం
సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు సీఎం కేసీఆర్ శనివారం రోజు అభినందనలు (CM KCR on Three Farms Law ) తెలిపారు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు. రైతులపై పెట్టిన కేసులను కేంద్రం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు తెలిపిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టారని... అమాయకులపై పెట్టిన దేశద్రోహం కేసులు ఎత్తివేయాలని స్పష్టం చేశారు. రైతుల విషయంలో కేంద్ర చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ మీడియాతో (CM KCR Press Meet) మాట్లాడారు. ఉద్యమ సమయంలో 700కు పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అమరులైన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని తెలిపారు. అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. రైతులకు సాయం కోసం రూ.22 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.