దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహోన్నత వ్యక్తుల స్ఫూర్తితో.... ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ముందుగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు స్వతంత్ర్య మార్చ్ చేపట్టాయి. అబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి త్రివర్ణ జెండాలతో ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బ్రిటీష్ పాలకులపై నాడు కాంగ్రెస్ చేసిన ఉద్యమాలతోనే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని రేవంత్ రెడ్డి వివరించారు.
కొన్ని రాజకీయపార్టీలు మతాల మధ్య చిచ్చుపెడుతూ... స్వార్ధరాజకీయలకు దేశాన్ని ప్రయోగశాలగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతులకు ఉచిత కరెంట్, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర, భూములపై సీలింగ్ యాక్ట్ తెచ్చి దళితులకు గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు హక్కులు కల్పించింది కాంగ్రెసేనని తెలిపారు. మోదీ పాసిస్టు ప్రభుత్వం వచ్చాక రైతుల జీవితాలను కట్టుబానిసలుగా మార్చి అంబానీ, ఆదానీలకు తాకట్టుపెట్టేలా నల్ల చట్టాలు తెచ్చారుని ఆరోపించారు. రైతులు మొక్కవోని దీక్షతో 9 నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు.