ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఎప్పుడు ఏం చేస్తారో, ఏ రాత్రి ఎన్నికలకు వెళతారో తెలియదని అందుకే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలని డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) సూచించారు. హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యేల నివాస ప్రాంగణంలో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రెండేళ్లు కాంగ్రెస్ నేతలు, శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి సర్వరోగ నివారణ ఎన్నికలేనని వెల్లడించారు. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని రేవంత్ తెలిపారు. తెరాస ప్రభుత్వం ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్ల ఒకతరం యువత నష్టపోయిందని పేర్కొన్నారు.
సోనియా మనిషిని...
తమది కాంగ్రెస్ కుటుంబమని... తాను సోనియాగాంధీ (Sonia Gandhi) మనిషినని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి... ప్రత్యేక సందర్భాల్లో తాను ఇతర పార్టీల్లో పనిచేశానన్నారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో తెలియదని... కేసీఆర్ బిడ్డ పోలికలున్న బొమ్మ అయితే కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి... అమరవీరుల స్తూపాన్ని కూడా వదల్లేదని ఆరోపించారు. అందులో కూడా కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని దుయ్యబట్టారు.
అన్ని బయటపెడతా...
త్వరలోనే పూర్తి ఆధారాలతో బయట పెడతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రావణాసురుడిని ఎదుర్కోడానికి వానర సైన్యం అంతా ఎలా పనిచేసిందో కేసీఆర్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్ శ్రేణులు అలా సిద్ధం కావాలన్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువత ఒక తరం నష్టపోయిందన్న రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్రణాళిక నిరుద్యోగ సమస్యపైనే ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదకరమని, కరోనా ఎదుర్కోడానికి వ్యాక్సిన్ వచ్చిందని, కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు రావాలన్నారు.