revanth reddy on kcr: ధాన్యం కొనుగోలుపై తెరాస, భాజపా కలిసి నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరి కాకుండా గతంలో మిగతా పంటలు వేసినా కొనుగోలు చేయక రైతులు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. ఎర్రజొన్నలు, మొక్కజొన్నలు, మిర్చి, పత్తి తదితర పంటలు సాగుచేసిన రైతులు దగా పడ్డారని విమర్శించారు. వ్యవసాయ పనిముట్లతో పాటు విత్తనాలు, మెట్టపంటలపై రాయితీ ఇవ్వకపోవడం వల్లే అన్నదాతలు వరి పండిస్తున్నారని రేవంత్‌రెడ్డి వివరించారు. తెరాస ఎంపీలు కొందరు సభకు రాకపోవడంలో ఆంతర్యమేంటని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ధాన్యాన్ని కేంద్రం ప్రభుత్వం కొనకపోతే రాష్ట్రం కొనకూడదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ప్రభుత్వం ధాన్యం కొనలేదా అని పేర్కొన్నారు. ధాన్యం కొనలేకపోతే వేల కోట్ల ప్రాజెక్టులెందుకు, రైతుబంధు ఎందుకని నిలదీశారు. వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదని విమర్శించారు. పసుపు బోర్డుపై నిజామాబాద్ రైతులను భాజపా మోసం చేసిందని... చక్కెర పరిశ్రమలను మూసివేసి కేసీఆర్ చెరకు రైతులకు నష్టం చేశారని ఆరోపించారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే తోటలు, మెట్ట పంటలు లేకుండా పోయాయన్నారు. ఏ పంటను కొనకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఏ పంటను కొనకపోతే.. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు: రేవంత్ రెడ్డి
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా... కేంద్ర ప్రభుత్వమే రైతులు పండించిన పంటను కొంటే.. ఇక మీ అవసరం ఏముంది.. మీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు..? రాష్ట్ర రైతులు పండించిన పంటను కొననప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు మీకు ఉందా..? భాజపా, తెరాసల ఒప్పందం.. అధాని, అంబానీలకు అనుకూలం. ఆ ఒప్పందంలో భాగంగానే ఆగస్టులో ఎఫ్‌సీఐ అధికారుల వద్ద సమావేశం జరిగినప్పుడు భవిష్యత్తులో పారా బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి.. రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మెడమీద కత్తిపెట్టి లేఖ తీసుకుందని అంటున్నారు... మెడమీద కత్తి పెడితే ఏది పడితే అది రాసిస్తారా..? మెడమీద కత్తిపెడితే గజ్వేల్‌లో ఫామ్‌హౌస్ రాసిస్తావా..? రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇతరులకు ఇస్తావా..? నీ కుమారుడుని మంత్రివర్గం నుంచి తొలగిస్తావా..? బిడ్డను, అల్లుడిని ఉన్న పదవుల నుంచి తొలగిస్తావా..? మెడమీద కత్తిపెట్టిందనే నెపంతో తెలంగాణ రైతుల హక్కులను కేంద్రానికి రాసిచ్చే అధికారం నీకు ఎవరిచ్చారు..? మెడమీద కత్తి అంటే.. నీ అవినీతిపై విచారణ చేపడతామని భయపెట్టారా..? నీ అవినీతిని బయటపెడతామని అన్నారా..? నీ మెడమీద కత్తి అంటే అర్థం ఏమిటో తెలంగాణ సమాజానికి చెప్పు.. నరేంద్ర మోదీ మెడ వంచేటోడివి.. నీ మెడమీద కత్తి పెట్టగానే మోదీ కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్. తెలంగాణ రాష్ట్ర రైతుల హక్కులు తాకట్టు ఎలా పెట్టావని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.
ఇదీ చూడండి:CM KCR ON YASANGI: 'యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు'