Revanth Reddy Fires on BJP : దేశాన్ని విభజించి అధికారాన్ని పదిలం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకే దేశ సమైక్యత కోసం రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని వివరించారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ప్రజల సంపదను అదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతుందని దుయ్యబట్టారు. అందుకే రాహుల్‌గాంధీ పేదల పక్షాన నిలబడి వారి గళం వినిపించారని వెల్లడించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈవ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారు : ఈక్రమంలోనే కక్షసాధింపు చర్యలో భాగంగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీని ప్రశ్నించినందుకే రాహుల్ ఇంటిని ఖాళీ చేయించారని విమర్శించారు. అధికారం ఉందని విర్రవీగిన ప్రధానికి కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఇందులో భాగంగానే కన్నడ ప్రజలను అభినందిస్తూ.. దీనికి కారణమైన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు.
యూత్ డిక్లరేషన్‌ను భవిష్యత్ కార్యాచరణగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. పేదల పక్షాన నిలవాలంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని వివరించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. రాజీవ్‌గాంధీ ఆన్‌లైన్ క్విజ్ కోసం 100 నియోజకవర్గాల్లో 25 లక్షల మందిని నమోదు చేయించాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ క్రియాశీలక పాత్రను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని నేతలకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.