హుజూరాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుతో పాటు రూ.5వేలు డీడీ కూడా ఇవ్వాలని, ఆరో తేదీన పీసీసీ సీనియర్ల బృందం వారిని ఇంటర్వ్యూ చేస్తుందని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణలు ఈ కమిటీ సభ్యులుగా వుంటారని వివరించారు. సెప్టెంబరు పదో తేదీ తరువాత ఏఐసీసీకి నివేదిక వెళ్తుందని, ఆ తరువాత అభ్యర్థి పేరు ప్రకటిస్తారని వివరించారు. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్.. నిజాం ఆస్తుల విషయం తీసుకొచ్చి మతాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఏడేళ్లుగా మోదీ సర్కారుకు నిజాం ఆస్తులు కనిపించలేదా అని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నాయని విమర్శించారు.
బండి సంజయ్‌ను కట్టడి చేయాలి
విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కట్టడి చేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. పాదయాత్రలో భాగంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారని నిరంజన్ ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి రాసిన లేఖలో సంజయ్‌ను కట్టడి చేసి... ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.