పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసేలా లేదని నల్గొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. ఎన్నికలు ఉన్న ఐదు రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇవ్వడం దుర్మార్గమన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చింది శూన్యమని ఆరోపించారు.
బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చింది శూన్యం: ఉత్తమ్ - telangana varthalu
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని నల్గొండ ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేటాయింపులు శూన్యమని ఆరోపించారు. కనీస మద్దతు ధరపై ప్రస్తావించకపోవటం దారుణమన్నారు.
భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందనడానికి ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు. రైతులు ఆందోళన చేస్తుంటే మద్దతు ధరపై ప్రకటన కూడా చేయలేదని ఉత్తమ్ ఆక్షేపించారు. పంట సేకరణ పెరిగిందన్న కేంద్ర ప్రభుత్వం.. రైతుల ఆత్మహత్యలపై ఎందుకు చెప్పలేకపోయిందని నిలదీశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయాలని సమావేశాల్లో కేంద్రాన్ని కోరబోతున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రైల్వే లైన్‌తో పాటు బుల్లెట్ రైలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అడక్కుండానే కేసీఆర్ ఆత్మగౌరవ భవనాలిచ్చారు: ఆర్. కృష్ణయ్య