తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్‌కు ఫ్రీహ్యాండ్... అసంతృప్తులకు హైకమాండ్ షాక్! - Tpcc latest updates

రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహణ, పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీలో పరిణామాలపై ఏఐసీసీకి ప్రత్యేక నివేదికలు టీపీసీసీ అందజేసిందా? రాష్ట్ర కాంగ్రెస్‌లో ధిక్కార స్వరాలకు అడ్డుకట్ట వేసే దిశలో సీనియర్ల ఎత్తులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై ఎత్తులు వేస్తున్నారా? నిర్ణయాధికారాలు పూర్తి స్థాయిలో రేవంత్‌ రెడ్డికి ఏఐసీసీ కట్టబెట్టిందా? అంటే... పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో దిక్కార స్వరం వినిపిస్తున్న సీనియర్‌ నాయకులకు అధిష్ఠానం అపాయింట్‌మెంట్‌ ఎందుకు దొరకలేదు? పార్టీలో పరిణామాలపై దిల్లీ పెద్దలకు పీసీసీ ఏం నివేదించింది?

Congress
Congress

By

Published : Mar 28, 2022, 5:25 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో రోజురోజుకు ధిక్కార స్వరాలు అధికమవుతున్నాయి. పార్టీ విషయాలు మీడియా ముందు మాట్లాడొద్దని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. బాహాటంగా మీడియా మందుకొచ్చి పార్టీకి నష్టం కలిగించేట్లు విమర్శలు చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో చొరవ చూపని కొందరు సీనియర్‌ నాయకులు... పదేపదే ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఏఐసీసీ వద్దన్నా... ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై దిల్లీ వెళ్లి హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. అయితే ఏఐసీసీ సీనియర్ల సమావేశాలనుకాని, వారి విమర్శలను కాని పెద్దగా పట్టించుకోవడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ నాయకుడి స్థాయిలో గంపెడాశతో దిల్లీ వెళ్లి నాలుగు రోజులు మకాం వేసినా... పెద్దల అపాయింట్‌మెంట్‌ దొరక్క వెనుదిరిగారు. దీంతో హైకమాండ్‌ అసంతృప్తి నేతలకు షాక్‌ ఇచ్చినట్లైంది.

రేవంత్‌పై ధిక్కార స్వరం...

Revanth Reddy Submitted Special Reports: రాష్ట్ర కాంగ్రెస్‌లో టీపీసీసీ చేపడుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటూ... కొన్ని నెలలుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కొందరు సీనియర్లు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. అంతేకాదు పీసీసీ కార్యక్రమాలలపై సవాలక్ష తప్పులను ఎత్తిచూపుతూ మీడియా ముందు బహిరంగంగా కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లు దిల్లీ వెళ్లి తనపై లేనిపోనివి కల్పించి చెప్పే అవకాశం ఉందని భావించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముందుగా మేల్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలతోపాటు, రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై పీసీసీనే సమగ్రమైన నివేదికలు ఏఐసీసీకి నివేదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

దొరకని అపాయింట్‌మెంట్...

త్వరలో చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ కూడా రేవంత్‌ రెడ్డి ఏఐసీసీకి అందజేసినట్లు తెలుస్తోంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేపడుతున్న కార్యక్రమాలను కూడా పెద్దలకు వివరించినట్లు సమాచారం. ఆ నివేదికలపై హైకమాండ్‌ సంతృప్తి చెందడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా రేవంత్‌ రెడ్డికి కల్పించినట్లు పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. దిల్లీలో నాలుగు రోజులు మకాం వేసినా సోనియా, రాహుల్ గాంధీలు అపాయింట్‌మెంట్ దొరకకపోగా... వ్యక్తిగత ఫిర్యాదులతో దిల్లీకి రావొద్దని మానిక్కం ద్వారా కేసీ వేణుగోపాల్‌ ఈ పెద్దలకు తెలియచెప్పినట్లు తెలుస్తోంది.

పూర్తిస్థాయి అధికారాలు...

TPCC Latest Updates: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించిన తరువాతే ఏ కార్యక్రమమైనా చేపట్టేందుకు టీపీసీసీ తుది నిర్ణయం తీసుకుంటోంది. ఇటీవల కాలంలో కొందరు సీనియర్‌ నాయకులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతున్నారని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి కార్యక్రమాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకునేందుకు పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చారంటూ... పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో మర్రి చెన్నారెడ్డికి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిలకు ఇదే తరహాలో పూర్తిస్థాయిలో నిర్ణయాధికారం అప్పజెప్పారని... అందువల్లనే వారిద్దరు అప్పట్లో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారని చెబుతున్నారు.

రేవంత్‌కు ఫ్రీహ్యాండ్...

ఇప్పుడు కూడా అదే తరహాలో ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వడం ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని భావించి... అదే సాంప్రదాయన్ని ఏఐసీసీ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర చేపట్టాలంటే.. రేవంత్‌ ఇచ్చిన నివేదికను పరిశీలన చేసి రాహుల్‌, సోనియాగాంధీలు ఓకే చేయాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చదవండి:Conflicts in Telangana Congress : కాంగ్రెస్‌లో కాక.. ఈసారి దిల్లీ చేరిన విభేదాలు

రేవంత్ రెడ్డిపై అందుకే నాకు కోపం వచ్చింది: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABOUT THE AUTHOR

...view details