Revanthreddy on KCR: తెలంగాణలో రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు అనుబంధ విభాగాలు కూడా ఇందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ పిలుపు ఇవ్వగానే రోడ్లపైకి వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రోజు రోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలకు సూచించారు.
విభజన హామీలకు దిక్కులేకుండా పోయింది..
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగులను రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళా నేరాలు, భూకబ్జాలు, సుపారీ హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. మరో వైపు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన హామీలకు దిక్కులేకుండా పోయిందన్నారు. బిహార్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే 40శాఖలకు అధిపతులుగా ఉన్నారని, అందుకు కృతజ్ఞతగా పరిపాలనను ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారని ఆరోపించారు. గౌలిగూడ, ఫలక్‌నుమా వరకు మెట్రో పూర్తి చేయకుండానే నిధులు దిగమింగారని... ఓల్డ్ సిటీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో వేస్తే కేవలం 9కిలోమీటర్లలో అయిపోతుందన్నారు. అధికార పార్టీ నాయకుల భూములకు ధరలు పెంచుకోడానికి గచ్చిబౌలి నుంచి మెట్రో వేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
డిసెంబర్‌లో అసెంబ్లీ రద్దు అవుతుంది..
రైతులు, నిరుద్యోగులెవరు ఆత్మహత్యలు చేసుకోవద్దన్న రేవంత్.. డిసెంబర్‌లో అసెంబ్లీ రద్దు అవుతుందని, 12 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. ఇది కేసీఆర్ చివరి బడ్జెట్ అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. గవర్నర్ ప్రసంగం జరిగితే...ప్రభుత్వం తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే అవకాశం ఉండేదన్న రేవంత్ రెడ్డి.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా మోదీకి వ్యతిరేకమని చెప్పుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాలు కనీసం 30 రోజులు జరిగేవని ఈసారి కనీసం 21 రోజులైనా జరిగేట్లు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.