Revanth Reddy Open Letter to Public : దేశంలోని అత్యున్నత ప్రభుత్వ సంస్థలు.. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారంటూ విమర్శించారు. ఆ రెండు పార్టీల్లో చేరిన వారు పవిత్రులు.. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా అంటూ ప్రశ్నించారు.
Revanth Reddy Fires on CM KCR :రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని.. ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని లేఖలో రేవంత్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులే టార్గెట్గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. బీజేపీ - బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగామని అన్నారు. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుంచి అందుతున్నాయని.. వీటి వెనుక ఉన్న ఆదృశ్య హస్తాలు ఎవరివని నిలదీశారు.
ఈసారి రెండుచోట్ల కేసీఆర్‌కు ఓటమి తప్పదు: రేవంత్‌రెడ్డి
'గడచిన పదేళ్లలో మోదీ - షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కుమన్నది లేదు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్ది... ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయి. అమిత్ షా - కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం.. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దాన్నీ అమలు చేయడం.. ఇదే కదా జరుగుతున్నది. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే... వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోంది.' - రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్