తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Letter to CM KCR: 'ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి' - cm kcr

Revanth Letter to CM KCR: రైతుల ప్రాణాలంటే కేసీఆర్ ప్రభుత్వానికి గడ్డిపోచతో సమానంగా కనిపిస్తున్నాయని రేవంత్​ మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వరి, మిర్చి రైతుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

Revanth Letter to CM KCR: 'ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి'
Revanth Letter to CM KCR: 'ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి'

By

Published : Dec 30, 2021, 6:31 PM IST

Updated : Dec 30, 2021, 9:08 PM IST

తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నిలువరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. గడిచిన మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతి రోజు 5 నుంచి 10 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట నష్టం జరిగిందనో, అప్పుల భారం మోయలేకనో నిస్సహాయ స్థితిలో పురుగుల మందు తాగి, ఉరి వేసుకుని బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటధాన్యం కొనుగోలు చేయక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారగా... మరో వైపు మిర్చీ రైతుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది..

వరి, మిర్చీ రైతుల పాలిట పురుగుల మందే పెరుగన్నంగా మారి ప్రాణాలు తోడేస్తోందని, ఉరితాడే యమపాశమై ఉసురు తీస్తోందని ఆరోపించారు. ఇందుకు పరిష్కారం చూపించాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఖమ్మం, మహబూబాబాద్‌, కొత్తగూడెం, వరంగల్ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 3,58,557 ఎకరాల్లో మిర్చీ పంట వేశారన్నారు. ఎకరానికి లక్ష వరకు పెట్టుబడులు పెట్టి మంచి దిగుబడి వస్తుందని ఆశించారన్నారు. అంతలోనే ఆశనిపాతంలా తామర పురుగు, రసం పీల్చే పురుగు, ఎండు తెగులు, కాయకుళ్లు తెగులు లాంటివి సోకి పెద్ద ఎత్తున పంటనష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు 25 నుంచి 30క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా ఐదారు క్వింటాళ్లకు మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు అప్పులు తెచ్చి మిర్చీ పండించిన రైతులకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

తక్షణమే పరిహారం ప్రకటించాలి..

ఈ పరిస్థితుల్లో పంట నష్టపోయిన మిర్చి రైతులకు తక్షణం పరిహారం ప్రకటించాలని, తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. మిర్చీ రైతుల్లో భరోసా నింపేందుకు తక్షణం మంత్రుల బృందం క్షేత్రానికి వెళ్లి పరిశీలన చేయాలని, లక్ష రుణమాఫీ చేయాలన్నారు. నెలల తరబడి ధాన్యం కుప్పలపై పడిగాపులు కాస్తోన్న రైతు హఠాత్తుగా శవమై కనిపిస్తోన్న దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే... తాజాగా మిర్చీ రైతుల మెడలకు బిగుసుకుంటోన్న ఉరితాళ్లు కలవరపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రేవంత్​రెడ్డి డిమాండ్లు:

  • పంట నష్టపోయిన మిర్చీ రైతులకు తక్షణం పరిహారం ప్రకటించాలి.
  • తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలి.
  • ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి.
  • మిర్చీ రైతుల్లో భరోసా నింపేందుకు తక్షణం మంత్రుల బృందం క్షేత్రస్థాయికి వెళ్లాలి.
  • రూ. లక్ష రుణమాఫీని తక్షణం అమలు చేయాలి.

ఇదీ చదవండి:

Last Updated : Dec 30, 2021, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details