Revanth Reddy Chit Chat : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోదని.. ఒంటరిగానే బరిలోకి దిగుతామని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో తన వ్యక్తిగత నిర్ణయం ఉండదని.. పార్టీ అధిష్ఠానం చెప్పిన చోటు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
Revanth Reddy on Karnataka Results : ఈ సందర్భంగా గాంధీ ఐడియాలజీ సెంటర్ కాంగ్రెస్ పార్టీకి ట్రైనింగ్ సెంటర్‌గా మారబోతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంవత్సరంలో 365 రోజులూ ఇది పని చేస్తుందని తెలిపారు. ఎంతో కష్టపడి ఈ సెంటర్‌ను అభివృద్ధి చేస్తున్నామని.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు ఇక్కడ శిక్షణ తీసుకుంటారని స్పష్టం చేశారు. గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు పక్కనే రాష్ట్రపతి నిలయం ఉందని.. 40 నిమిషాల్లో ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి వీలుందని వివరించారు. అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ ఐడియాలజీ సెంటర్‌ను వాడుకునే వీలుందన్నారు.
భూమిని లాక్కునే ప్రయత్నం చేశారు..: అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ కేంద్రం, వసతి గదుల నిర్మాణం చేయబోతున్నట్లు రేవంత్ చెప్పారు. ఈ క్రమంలోనే గాంధీ ఐడియాలజీ కేంద్రానికి భూమి ఇచ్చిన వ్యక్తి చనిపోతే.. సర్కారు ఈ భూమిని లాక్కునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అన్ని పార్టీలకు భూ కేటాయింపులు జరిగాయని.. కాంగ్రెస్‌కే కేటాయింపులు జరగలేదని విమర్శించారు. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్‌లో క్యాన్సిల్ చేయాలని అనుకున్నారని.. దానికి కౌంటర్ దాఖలు చేసినట్లు చెప్పారు.