Revanth Reddy Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తలపెట్టిన ఎర్రవల్లి రచ్చబండ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి సోమవారం వెళ్లి... వరిసాగుతోపాటు అన్నదాతల సమస్యలపై గళమెత్తాలని రేవంత్ నిర్ణయించారు. రేవంత్ పిలుపుతో ఉదయాన్నే పోలీసులు ఆయన ఇంటి వద్ద మోహరించారు. నివాసం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి... గృహనిర్బంధం చేశారు. అప్పటికే రేవంత్ నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. ఎలాగైనా ఎర్రవల్లికి వెళ్లాలంటూ రేవంత్ బయటకి రావడంతో... పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రేవంత్ అరెస్ట్
తీవ్ర ఉద్రిక్తత మధ్యే రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పీఎస్‌కు తరలిస్తుండగా... కార్యకర్తలు వాహనాలకు అడ్డుగా నిలుచున్నారు. పోలీసులు అతికష్టం మీద వారిని తప్పించి... రేవంత్‌ను అక్కడి నుంచి అంబర్‌పేట్ పీఎస్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తెరాస, భాజపా కలిసి వడ్ల అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. ఉమ్మడి కుట్రలో భాగంగానే మంత్రులు దిల్లీ వెళ్లొచ్చారని... ఇప్పుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ఆందోళనలు
యాసంగిలో రైతులు వరి పంట వేయవద్దని... వేసినా కొనుగోలు చేసేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేదిలేదని పదేపదే తేల్చి చెప్పింది. ప్రస్తుతం రబీలో పండిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించి... రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు వరిధాన్యం కొనుగోలు, యాసంగి పంట సాగు తదితర అంశాలపై చర్చించేందుకు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించింది.
రచ్చబండ ఎందుకంటే?
సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవెల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమంలో... రైతులతో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై అడిగి తెలుసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. రాష్ట్రమంతటా వరిపంట వేయవద్దని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్... తన పొలంలో వరి పంట ఎలా వేస్తారని నిలదీస్తూ... పంటసాగు చేసిన ఫొటోలు, వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. సోమవారం నిర్వహించ తలపెట్టిన రైతు రచ్చబండ కార్యక్రమానికి రైతులతోపాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు హాజరు కావాల్సిందిగా కోరారు.
ఉద్రిక్తల నడుమ అరెస్ట్
సోమవారం ఉదయం నుంచే ముఖ్య నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నాయకులు ఎవరూ ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం అన్నివైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎటువైపు నుంచి వచ్చినా అరెస్టు చేసేలా చర్యలు చేపట్టారు. పోలీసులతోపాటు యాభైమందికిపైగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులతో నిండిపోయాయి. అప్పటికే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రేవంత్ ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రేవంత్ కార్యకర్తలతో కలిసి బయటకు వచ్చారు. వెంటనే పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసుల వలయాన్ని నెట్టుకుని రోడ్డుపైకి వెళ్లగలిగారు. అక్కడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అడ్డుకుని తోపులాట మధ్యలో బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి... అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు, నాయకుల తోపులాట
పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పోలీసుల మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కింద పడ్డారు. కోపోద్రిక్తులైన కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత... కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:Niranjan reddy on BJP And congress : 'కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర మరచి భాజపాకు సహకరిస్తోంది'