హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో నేతలకు.. ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు (revanth reddy on huzurabad election campaign). ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు తెలపాలని సూచించారు. హుజూరాబాద్ ఎన్నికల ఇంఛార్జీలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్ యాప్ ద్వారా సమావేశమయ్యారు.
ఇందులో భాగంగా వచ్చే వారం రోజులపాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలను (campaign methods) నాయకులతో రేవంత్ రెడ్డి చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడు, విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని యువతలోకి తీసుకు వెళ్లాలని తెలిపారు. భాజపా, తెరాస మోసపూరిత విధానాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, నష్టాలను వివరించాలని పేర్కొన్నారు. భాజపా, తెరాస లోపాయికారి ఒప్పందాలు, చీకటి రాజకీయాలను బయట పెట్టాలని నేతలకు సూచించారు. కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండేలా ప్రచార వ్యుహాలను అమలు చేయాలన్నారు.