కొవిడ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై టీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ దొర పాలన సాగుతోందని, ఇటీవల జరుగుతున్న పరిణామాలే దానికి నిదర్శనమని మండిపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న పరిస్థితుల్లో ప్రాణాలకు సైతం తెగించి వైద్య సిబ్బంది పనిచేస్తుంటే వారిని అవమానాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది.. నర్సుల ఆందోళన చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని ధ్వజమెత్తారు.
ఆర్టీసీ సిబ్బంది ఎలా బతకాలి..
పోస్టింగులు, సీనియారిటీ, జీతాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన నర్సులకు జవాబు చెప్పలేక ప్రభుత్వం నీళ్ళు నములుతోందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ సిబ్బందికి అందిన అరకొర జూన్ నెల జీతాలే వారి అన్యాయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. తమకొచ్చిన జీతం డబ్బులతో ఆర్టీసీ సిబ్బంది ఏ విధంగా బతకాలో తెలియక కుమిలిపోతున్నారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఎం కేసీఆర్ ఎప్పుడు ఫాం హౌస్‌లో ఉంటారో... ప్రగతి భవన్‌లో ఎన్నడు దర్శనమిస్తారో తెలియని అయోమయం నెలకొందన్నారు.
ఇవీ చూడండి : "స్పీకప్ తెలంగాణ"లో మీ గళాన్ని వినిపించండి:కాంగ్రెస్