కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు మోసానికి గురవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అన్యాయానికి గురైన దళితులందరికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసుల కస్టడీలో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతిచెందిన ఘటనపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దళిత ఆవేదన దీక్ష పేరుతో హైదరాబాద్లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు కార్యక్రమం నిర్వహించారు.
సీఎంకు నైతిక హక్కు లేదు
మరియమ్మ ఘటన గురించి తెలియదన్న సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. ఇవాళ దళితుల సాధికారిత గురించి మాట్లాడుతున్న సీఎం... ఏడేళ్ల కాలంలో వారి అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించలేదని నిలదీశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు ఆవేదన చెందుతున్నారని దాసోజు శ్రవణ్ అన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు 116 ఎస్సీ, ఎస్టీల హత్యలు జరిగాయని... దాదాపు 6 వేల అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారందరికీ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.