తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ అధికారుల తీరుపై ప్రభుత్వం ఆగ్రహం

నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, అక్రమ నిర్మాణాల తొలగింపులో జాప్యంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్​ఎంసీ అధికారులతో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​ కుమార్​ సమావేశం నిర్వహించారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నా... పట్టించుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జీహెచ్​ఎంసీ అధికారులు

By

Published : May 30, 2019, 10:51 AM IST

జీహెచ్​ఎంసీ అధికారులతో సమావేశమైన పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్​ కుమార్​

గ్రేటర్​లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, ఫుట్​పాత్​ల ఆక్రమణలు, అనుమతి లేని భవన నిర్మాణాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్​ఎంసీ జోనల్​, డిప్యూటీ కమిషనర్లు, టౌన్​ ప్లానింగ్​, మెడికల్​ అధికారులతో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​ కుమార్​ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్‌, అదనపు క‌మిష‌న‌ర్లు శృతి ఓజా తదితరులు సమావేశానికి హాజ‌రయ్యారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అరవింద్​ కుమార్​ మండిపడ్డారు. బేగంపేట, ఖైరతాబాద్​ పరిధిలోని ఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్​ ఇన్​ఛార్జీగా ఉన్న బేగంపేట సహాయక సిటీ ప్లానర్​ సుభాష్​ను సస్పెండ్​ చేయాలని ఆదేశించారు.

క్షేత్ర స్థాయిలో నిర్వహణ లోపం

ఆరు నెలల ఎన్నికల కోడ్​ కారణంగా జీహెచ్​ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించారని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​కుమార్​ అన్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు లేకపోవడం వల్లే పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ కుంటుపడిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు.

కోచింగ్​ సెంటర్లపై దృష్టి

ఇటీవల సూరత్​లో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో నగరంలోని అమీర్​పేటలో కోచింగ్​ సెంటర్ల నిర్వహణపై దృష్టి సారించాలని అరవింద్​ కుమార్​ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, హోర్డింగ్​లను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల మెరుగు, ఆక్రమణల తొలగింపులో గణనీయ మార్పులు రావాలని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపు బాధ్యత టౌన్​ ప్లానింగ్​ అధికారులదేనని అన్నారు.

ఇదీ చూడండి : జగన్, మోదీల ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details