వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఆదివారం జరగనుంది. కరోనా పరిస్థితుల వల్ల గతంలో వాయిదా పడిన పరీక్షను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 15 లక్షల 97 వేలు.. రాష్ట్రంలో 55,810 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మాస్కులను అనుమతించాలని నిర్ణయించిన జాతీయ పరీక్షల సంస్థ.. బూట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని ఆభరణాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
గదికి 12మంది మాత్రమే..
ఈ ఏడాది కరోనా నేపథ్యంలో గతంలో వాయిదా పడిన నీట్.. మళ్లీ వాయిదా పడుతుందా.. కొనసాగుతుందా అనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. కొవిడ్ నివారణ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా 2,546 పరీక్ష కేంద్రాలు ఉండగా.. భౌతిక దూరం పాటించేందుకు.. ఈసారి 3,840 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక గదిలో గతంలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. ఈ ఏడాది 12 మంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకొంది.