BJP Deeksha at Indira Park: రేపు హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపడుతున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష జరగనుందని బండి సంజయ్ తెలిపారు. భాజపా ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించే అంశాన్ని పరీశీలించాలన్న హైకోర్టు సూచనను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ దీక్షకు దిగుతున్నామని ఆయన తెలిపారు.
పార్లమెంటరీ సాంప్రదాయాలను తుంగలో తొక్కుతోందనడానికి భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌నే నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్ పెడచెవిన పెట్టడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని స్పీకర్ కాపాడాలని హితవు పలికారు. దీక్షలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్ పాల్గొంటారని వెల్లడించారు. భాజపా దీక్షకు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
కేసీఆర్ భయపడుతున్నారు
అనంతరం నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు చూసి కేసీఆర్ భయపడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమియ బిల్లుపై మాట్లాడుతూ కేంద్రాన్ని విమర్శించడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి వారి గురించే మాట్లాడారని ఎద్దేవా చేశారు.