Tomoato rates Hike in hyderabad: శ్రీలంకలో సంక్షోభం టమాటా ధరలపై ప్రభావం చూపుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పండిన పంట అంతా శ్రీలంకకు ఎగుమతి అవుతుండటంతో నగరానికి రావడం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, మహారాష్ట్ర నాందేడ్ నుంచి వస్తున్న టమాటాతో ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నెల క్రితం (ఏప్రిల్ 6న) కిలో ధర రూ.12 హైదరాబాద్లోని రైతుబజారులో ఉంటే, మార్కెట్‌లో రూ.20కి అటుఇటుగా అమ్మేవారు. శుక్రవారం కిలో రూ.34 రైతుబజారులోనే ఉంది. బయట రూ.60-70కి తగ్గకుండా అమ్మేస్తున్నారు. సాధారణ రోజుల్లో నగరంలోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజూ 9000 బాక్సులు(ఒక్కో బాక్సులో 25కిలోలు) టమాటా వస్తుంది. అప్పుడు ధర రూ.15లోపు రైతుబజారులో దొరుకుతుంది. ప్రస్తుతం 3 వేల బాక్సులే వస్తున్నాయి. చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి రోజూ 50 ట్రక్కులు శ్రీలంకకు తరలుతోంది. దీంతో బాక్సు టమాటా రూ.1200 పలుకుతోంది. ఈనెలాఖరుదాకా ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో ఎండిపోయిన పంట :ఎండలకు తెలంగాణలో టమాటా పంట ఎండిపోయింది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ నుంచి 30శాతం టమాటా వస్తోంది. మిగతా 70 శాతం రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి వస్తోంది. 25 కిలోల బాక్సు రూ.700 ఉండగా, అంకాపూర్ నుంచి వచ్చే టమాటా బాక్సు రూ.800 పలుకుతోంది. దీంతో రైతుబజారులోనే కిలో రూ.34 ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రిటైల్ అమ్మకందారులు నేరుగా బోయినపల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లి తెచ్చుకోవడంతో ధరలు పెంచుతూ అమ్ముతున్నారు.