తెలంగాణ

telangana

ETV Bharat / state

Tomato Price Today: కూరగాయలు ఎంత భారమాయె! - హైదరాబాద్​లో టమాటాల ధర

Tomato Price Today: కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. టమాటాల చిల్లర ధర రైతుబజార్లలో కిలో రూ.60కి చేరితే బయట మార్కెట్లలో ప్రాంతాలను బట్టి రూ.80 నుంచి రూ.100 దాకా విక్రయిస్తున్నారు. నగరానికి కాస్త దూరంగా రూ.50 నుంచి 60 మధ్య అమ్ముతున్నారు.

Tomato Price Today, tomato price
టమాట ధర

By

Published : Nov 25, 2021, 8:32 AM IST

Tomato Price Today: కొవిడ్​ ప్రభావం నుంచి తేరుకోక ముందే.. సామాన్యులపై కూరగాయల ధరలు ప్రభావం చూపిస్తున్నాయి. పెరిగిన నూనె, పెట్రో ధరలకు దీటుగా కూరగాయల ధరలు కూడా (Tomato Price is Increasing) ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు అందుకునేంత దగ్గర్లో కూడా ఉండట్లేదు. దీంతో చేసేదేమి లేక... ధరల మంట భరించలేక నాణ్యతలేని, మచ్చలు పడిన, పనికిరాని కూరగాయలను సైతం కొందరు కొంటున్నారు. గతేడాది (2020) నవంబరు 24న హైదరాబాద్‌ రైతుబజార్లలో కిలో టమాటాల ధర రూ.24 కాగా బుధవారం అదే తేదీన రూ.60కి అమ్మారు. సరిగ్గా నెలక్రితం కిలో రూ.20కే అమ్మడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా పట్ణణ ప్రాంతాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది.

ఎందుకీ పెరుగుదల?

హైదరాబాద్‌ మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచే సగానికి పైగా కూరగాయలు వస్తాయి. చిత్తూరు జిల్లా నుంచి టమాటా దిగుమతి అవుతుంటుంది. కొన్ని రోజులుగా రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి పంటలన్నీ పాడయ్యాయి. ఆ ప్రభావం టమాటా ఉత్పత్తులపై పడింది. అక్కడి నుంచి పంట రావడం దాదాపుగా నిలిచిపోయింది. దీంతో ధర అమాంతం ఎగబాకింది. ఇదే అదనుగా వ్యాపారులు, దళారులు ధరను విపరీతంగా పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. శివారులోని చేవెళ్ల, కందుకూరు, నవాబుపేట, శంకర్‌పల్లి, శామీర్‌పేట, భువనగిరి తదితర ప్రాంతాల నుంచి కొంతమేరకే టమాటా వస్తోంది. స్థానిక మార్కెట్‌ అవసరాలకే సరిపోతుండటంతో నగరానికి తక్కువగానే వస్తోందని అధికారులు వివరిస్తున్నారు. గత రెండు నెలలుగా కురిసిన అధిక వర్షాలకు చాలా ప్రాంతాల్లో కూరగాయల తోటలకు నష్టం ఎక్కువగా ఉంది. డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావం కూడా పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌కు కూరగాయలు సరఫరా చేసే బోయిన్‌పల్లి టోకు మార్కెట్‌కు బుధవారం మొత్తం అన్ని రకాల కూరగాయలు కలిపి 20,885 క్వింటాళ్లు రాగా అందులో 53 శాతం ఇతర రాష్ట్రాలవే ఉన్నాయి.

  • 2020 నవంబరు 24న బోయిన్‌పల్లి మార్కెట్‌కు 2768 క్వింటాళ్ల టమాటాలు (Tomato Price is Increasing) రాగా గరిష్ఠంగా రూ.22, కనిష్ఠంగా రూ.4 చొప్పున టోకు ధరకు అమ్మారు.
  • 2021 నవంబరు 24న ఇదే మార్కెట్‌కు 1239 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.58, కనిష్ఠంగా రూ.48కి టోకుగా విక్రయించారు. చిల్లర వ్యాపారులు రూ.20 -40 దాకా అదనంగా వసూలు చేస్తున్నారు.
  • బెండకాయల ధర కూడా ఏడాది వ్యవధిలో రూ.15 నుంచి 50కి చేరింది.
  • కార్తికమాసం కావడం, దీనికితోడు దీక్షలు, వ్రతాలు, నోములు వంటి వాటి వల్ల కూరగాయల వినియోగం అధికమైందని టోకు వ్యాపారి ఒకరు చెప్పారు.
  • 2020 నవంబరులో బోయిన్‌పల్లి మార్కెట్‌కు రోజూ సగటున 15,546 క్వింటాళ్లే వచ్చినా ధరలు అదుపులో ఉన్నాయి. ఈ నెలలో సగటున 20,504 క్వింటాళ్లు వస్తున్నా కూరగాయలు సరిపోకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details