తెలుగు చిత్ర సీమలో సంచలనం సృష్టిస్తున్న మాదకద్రవ్యాల కేసు(TOLLYWOOD DRUGS CASE)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ENFORCEMENT DIRECTORATE)(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు 7 గంటలపాటు సినీనటుడు దగ్గుబాటి రానా(DAGGUBATI RANA)ను విచారించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్(KELVIN)ను ఈడీ అధికారులు మరోసారి కార్యాలయానికి పిలిపించి విచారించారు. నిన్న సుదీర్ఘంగా కెల్విన్‌ను ప్రశ్నించిన అధికారులు... ఈ రోజు రానా, కెల్విన్‌ను వేర్వేరుగా ప్రశ్నించారు.
కెల్విన్ ఎవరో తెలీదు..
మనీలాండరింగ్ కేసు(MONEY LAUNDERING)లో ఈడీ నోటీసులు అందుకున్న రానా... ఇవాళ అధికారుల ఎదుట హాజరయ్యారు. రానా బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు... కెల్విన్‌తో లావాదేవీలపై ఆరా తీశారు. తనకు కెల్విన్ ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. అయితే మనీ లాండరింగ్ కోణంలో రానా బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి.. అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ క్లబ్ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.