Nandamuri Tarakaratna Paases Away: ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. 23 రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ నందమూరి తారకరత్న (40) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తారకరత్న పార్థివదేహాన్ని ఈ రాత్రికి హైదరాబాద్కు తరలించనున్నారు. రేపు హైదరాబాద్లో తారకరత్న పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయమే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆసుపత్రి వైద్యులు కుటుంససభ్యులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు వారికి వివరించారు. రాత్రి 10 గంటల సమయంలో తారకరత్న మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.
తారకరత్న అకాల మరణంతో తెలుగు నాట విషాదకర వాతావరణం నెలకొంది. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఇవాళ తామందరికి దూరమయ్యారని ట్విటర్లో సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీపీసీసీ రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది:గత నెల 27న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఆయన ఆ యాత్రలో కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా కింద పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న యువగళం సిబ్బంది.. కార్యకర్తలు కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత చిత్తూరు పట్టణంలోని పీఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు.