తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ కీలక నిర్ణయం

సమ్మెపై ఆర్టీసీ ఐకాస ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. నేటితో ఆర్టీసీ దీక్ష 46వ రోజుకు చేరుకుంది. ఇవాళ తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ఐకాస ప్రకటించింది. ఆర్టీసీ ఐకాసలోని అన్ని యూనియన్ల కేంద్ర కమిటీలు సమావేశం కానున్నాయి. ఇప్పటి వరకు ఆర్టీసీ సమ్మె కొనసాగిన విధానం, కార్మికుల అంకితభావంపై సుధీర్ఘంగా సమాలోచనలు జరపనున్నారు. అనంతరం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆర్టీసీ ఐకాస నేతలు తెలిపారు.

By

Published : Nov 19, 2019, 5:52 AM IST

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ కీలక నిర్ణయం

ఆర్టీసీ సమ్మెపై ఇవాళ కీలక నిర్ణయం

ఆర్టీసీ కార్మికుల సమ్మె విచారణ హైకోర్టు నుంచి లేబర్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంది. రెండు వారాల్లో ఆర్టీసీ సమ్మెపై నిర్ణయం తీసుకోవాలని ఆశాఖ కమిషనర్​ను హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో లేబర్ కమిషనర్ చర్చించి నివేదిక రూపొందించే అవకాశం ఉంది. కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. డిమాండ్లు నెరవేర్చుకోవడానికే సమ్మె చేస్తున్నారని హైకోర్టుకు ఆర్టీసీ ఐకాస తరఫు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వివరించారు. ఈ తరుణంలో ఆర్టీసీ కార్మికులూ సమ్మెపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీక్ష చేస్తున్న ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి సోమవారం దీక్ష విరమించారు. అఖిలపక్ష నేతల ఒత్తిడి మేరకే దీక్ష విరమించారని... ఆర్టీసీ కార్మికులు తీసుకోబోయే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు.

కీలక నిర్ణయం...

ఈ రోజు జరిగే ఆర్టీసీ ఐకాస సమావేశంలో నేతలు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వీరి తరఫు న్యాయవాది ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించడానికి సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలపడాన్ని బట్టి చూస్తే... ఐకాస నేతలు ఆ దిశగా చర్చించే అవకాశం ఉంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఐకాస తలపెట్టిన సడక్ బంద్ ను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం కార్మిక శాఖ కమిషనర్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, కార్మికులతో చర్చించే అవకాశం ఉన్నందున.... కమిషనర్ ముందుంచే అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. రెండు వారాల్లోపే సమ్మెపై కార్మిక శాఖ కమిషనర్ నివేదిక రూపొందించాల్సి ఉండటంతో... తమ డిమాండ్లు, ఇతర అంశాలు, సమ్మెకు దిగడానికి గల కారణాలను కార్మిక సంఘాలు కమిషనర్ ముందుంచనున్నారు.

సాయంత్రం తుది నిర్ణయం..

హైకోర్టు తీర్పు పూర్తి కాపీ చదివి సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. హైకోర్టులో 5,100 పర్మిట్లు, ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల వేతనాలతో పాటు.... కార్మికుల ఆత్మహత్యలకు సంబంధించిన పిటిషన్లు ఇవాళ విచారణకు రానున్నాయి. రూట్ పర్మిట్లపై హైకోర్టు విధించిన స్టే ఈ రోజు కూడా కొనసాగనుంది.

ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details