Telangana Rain Updates Today : రాష్ట్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HYDERABAD IMD) పేర్కొంది. ఈ రోజు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి.. ఎత్తుకు వెళ్లే కొలదీ దక్షిణ దిశ వైపుకు వాలి ఉందని సంచాలకులు వివరించారు. ఇదే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందన్నారు.
Adialabad rains :మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముసురు పట్టుకుంది. శుక్రవారం రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వాన జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టుల్లోకి వరద వస్తోంది. ఫలితంగా అక్కడి ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చిన్న చిన్న వాగులు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడుతోంది. జులై మాసం చివరలో ఆగిపోయిన వర్షాలతో ఇబ్బందికరంగా మారిన పత్తి, సోయా పంటలకు.. ప్రస్తుతం పడుతున్న ముసురు జీవం పోసినట్లయింది.