Rains in TS: రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 29న కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు కేరళ మొత్తంగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తమిళనాడులోని మరికొన్ని భాగాల్లో విస్తరించాయని వివరించింది.
రాగల రెండు రోజుల్లో రుతు పవనాలు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, కొంకన్, గోవాలోని కొన్ని భాగాలకు విస్తరిస్తాయని తెలిపింది. తమిళనాడులోని మరికొన్ని భాగాలతో పాటు మొత్తం నైరుతి బంగాళాఖాతం వరకు రానున్నట్లు పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు, ఈశాన్య బంగాళాఖాతంలోనికి నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.